ఎపి,తెలంగాణాల్లో ఎన్నికలు శుక్రవారం జరిగితే జగన్ పరిస్థితి ఏంటి?...:బుద్ధా వెంకన్న
అమరావతి: టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి జగన్, బిజెపిపై విమర్శల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబుపై జగన్ అవాకులు చవాకులు పేలితే ప్రజలు సహించరని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు.
అవినీతిపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణలో ఎన్నికలు శుక్రవారం జరిగితే జగన్ పరిస్థితి ఏమిటని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్ర ద్వారా వైసీపీ గ్రాఫ్ పడిపోతోందని విశ్లేషించారు. అమరావతి బాండ్లపై బీజేపీ నేతల విమర్శలు సరికాదని అన్నారు. చంద్రబాబు ఇమేజ్ చూసి అమరావతి బాండ్లు కొనుగోలు చేశారన్నారు.

అంతకుముందు మంత్రి కాల్వ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జగన్ పై ధ్వజమెత్తారు. చంద్రబాబును తిట్టడం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రజలకు అండగా ఉంటానని చెప్పడానికి పాదయాత్ర అద్భుతమైన ఆయుధమని...కానీ అలాంటి ఆయుధాన్ని జగన్ దుర్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి కాల్వ విశ్లేషించారు.
జగన్ పాదయాత్ర చేస్తుంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందనే ఆందోళన సొంత పార్టీ వైసిపి కార్యకర్తలకైనా ఉందో లేదో కనుక్కోవడానికి పీకే టీమ్‌తో సర్వే చేయించుకోవాలని మంత్రి కాల్వ ఎద్దేవా చేశారు. మోడీని ప్రసన్నం చేసుకోవడానికే జగన్ పదే పదే టీడీపీని విమర్శిస్తున్నారని మంత్రి కాల్వ అన్నారు. సోనియాతో యుద్ధమని గతంలో చెప్పిన జగన్...కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్‌కు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వలేదా?...అని మంత్రి కాల్వ నిలదీశారు.
Recommended Video

ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే జగన్ ఏమాత్రం సిగ్గులేకుండా మోడీ పంచన చేరారని దుయ్యబట్టారు. బీజేపీతో జగన్ చేస్తోన్న దొంగ కాపురం అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్రంపై పోరాడుతోంది టిడిపి మాత్రమేనని మంత్రి కాల్వ చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా అందర్నీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కాల్వ వెల్లడించారు. కానీ జగన్ ఆలోచన మాత్రం ఏదో విధంగా బీజేపీని ఆదుకోవాలన్నదేనన్నారు. ఇప్పటికైనా జగన్ నిర్మాణాత్మక పాత్ర పోషించకుంటే 2019 ఎన్నికల్లో వచ్చే సీట్లు కూడా రావని మంత్రి కాల్వ శ్రీనివాసులు జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications