మోడీతో జగన్ 40 ని.లు భేటీ: చంద్రబాబుకు గుబులు, అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఢిల్లీలో జరిగిన భేటీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి గుండెల్లో గుబులు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మోడీ జగన్‌తో భేటీ కావడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు పడుతున్నట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి బిజెపి తెగదెంపులు చేసుకోవడానికి ఆ భేటీలో ప్రాతిపదిక ఏర్పడినట్లు చెబుతున్నారు. మోడీతో జగన్ భేటీని నిలువరిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆ భేటీ పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఆర్థిక ఉన్మాది అయిన జగన్‌కు మోడీ భేటీకి అనుమతి ఇవ్వడం ఏమిటనేది తెలుగుదేశం పార్టీ నాయకుల అభ్యంతరం.

తెలుగుదేశం పార్టీ నాయకుల వాదనను బిజెపి నాయకులు తిప్పికొడుతున్నారు. కేసుల్లో జగన్ నిందితుడు మాత్రమేనని, దోషిగా తేలలేదని అంటూ అలాంటప్పుడు మోడీ జగన్‌తో భేటీ కావడంలో తప్పేముందని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే, మోడీకీ జగన్‌కూ మధ్య కీలకమైన చర్చలే జరిగినట్లు ప్రచారం సాగుతోంది.

అంత సేపు వారి మధ్య....

అంత సేపు వారి మధ్య....

మోడీ అపాయింట్‌మెంట్ కోసం జగన్ చాలా కాలంగా ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. కానీ ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు మోడీ ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడమే కాదు, ఆయనతో దాదాపు 40 నిమిషాల పాటు ఆంతరంగిక భేటీ జరిపారు. ఏదో వినతిపత్రం సమర్పించడానికో, చంద్రబాబుపై ఫిర్యాదు చేయడానికో అయితే అది పెద్దగా చర్చకు వచ్చి ఉండేది కాదు. కానీ, ఇరువురి మధ్య చాలా లోతైన చర్చలు జరగడమే తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదని అంటున్నారు.

భేటీకి సహకరించిందెవరు....

భేటీకి సహకరించిందెవరు....

ఓ బడా కార్పోరేట్ కంపెనీ ప్రముఖుడు మోడీతో భేటీకి జగన్‌కు సహకరించినట్లు ప్రచారం సాగుతోంది. ఆ కార్పోరేట్ కంపెనీ ప్రముఖుడు వైయస్ జగన్‌కు సన్నిహితడని చెబుతున్నారు. ఆయనే 2014 ఎన్నికల్లో బిజెపికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు కోసం ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ఆ ప్రముఖుడు మోడీకి కూడా దగ్గరివాడని తెలుస్తోంది. అయితే, మోడీ జగన్‌తో భేటీకి అంగీకరించడంలోనే అసలు విషయం ఉందని అంటున్నారు.

మోడీ అడిగారా...

మోడీ అడిగారా...

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కొంత బలం అవసరమని బిజెపి భావిస్తోంది. అందుకే, ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని మోడీ జగన్‌ను అడిగినట్లు చెబుతున్నారు. అందుకు జగన్ వెంటనే సై అన్నారని సమాచారం. అంతేకాకుండా తాము రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు జగన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రతిపక్షాలు వేరే అభ్యర్థిని పెట్టడం కూడా అనవసరమని చెప్పారు. అభ్యర్థిని పెట్టాలని సోనియా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని కూడా ఆయన అన్నారు. మొత్తం మీద, బిజెపికి జగన్ సానుకూలంగా మారిపోయారనేది దీన్ని బట్టి అర్థమవుతోంది.

కాంగ్రెసుతో వెళ్లకుండా....

కాంగ్రెసుతో వెళ్లకుండా....

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో తెగదెంపులు చేసుకునే ఆలోచనే బిజెపిలో ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెసుకు మద్దతుదారులు దొరకకుండా చేయడం కూడా బిజెపి వ్యూహంలో భాగం. చంద్రబాబుతో బిజెపి కలిసి నడిస్తే జగన్ కాంగ్రెసుతో వచ్చే ఎన్నికల్లో అవగాహనకు వచ్చే అవకాశం ఉందే ప్రచారం ఉండనే ఉంది. దీంతో కాంగ్రెసుకు జగన్ దగ్గర కాకుండా చూడాలనే ఉద్దేశంలో భాగంగా కూడా మోడీ జగన్‌తో భేటీకి అంగీరించినట్లు చెబుతున్నారు.

జగన్ కేసుల గురించి అడిగారా...

జగన్ కేసుల గురించి అడిగారా...

తనపై న్న కేసుల విషయంలో కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఎగదోయవద్దని జగన్ మోడీని కోరారని అంటున్నారు. చట్టపరంగా న్యాయస్థానాల్లో ఏం జరిగినా ఫరవాలేదు గానీ కేంద్రం జోక్యం చేసుకోవద్దని, ఉద్దేశ్యపూర్వకంగా ఆ పనిచేయకూడదని ఆయన కోరినట్లు చెబుతున్నారు. వరుసగా స్టేలు తెచ్చుకుంటూ చంద్రబాబు విచారణలు జరగుకుండా చూసుకుంటున్నారని జగన్ ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

మోడీ ఏమన్నారు....

మోడీ ఏమన్నారు....

జగన్‌పై కేసుల విషయంలో మోడీ స్పష్టమైన వైఖరినే ప్రదర్శించినట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని, తాము జోక్యం చేసుకోబోమని, అదే సమయంలో కేసులను అటక ఎక్కించలేమని మోడీ జగన్‌తో చెప్పినట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయో చూద్దామని అన్నట్లు కూడా చెబుతున్నారు.

ఈసారి కలిసి వెళ్దాం...

ఈసారి కలిసి వెళ్దాం...

నీ ఓటు బ్యాంకు వేరు, మా ఓటు బ్యాంకు వేరని, 2014లోనే కలిసి వెళ్లే బాగుండేదని, పైగా నీ ప్రభావం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో బిజెపికి ఉపయోగపడుతుందని మోడీ జగన్‌తో అన్నట్లు చెబుతున్నారు. ఈసారి కలిసి ఎన్నికలకు వెళ్దామని, తమకు ఎవరి వల్ల మేలు జరుగుతుందో మైనారిటీలు చూస్తారని, యుపిలో మైనారిటీ ఓట్లు తమకు పడ్డాయని మోడీ అన్నట్లు చెబుతున్నారు.

జగన్ ఏమన్నారు...

జగన్ ఏమన్నారు...

ఎన్నికల ముందు పొత్తుగానీ పార్టీ విలీనం గానీ ఇరువురికీ నష్టమేనని జగన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. అయితే, ఇకపై బిజెపి మీద గానీ కేంద్రం మీద గానీ తాను దూకుడుగా వెళ్లబోనని చెప్పినట్లు తెలుస్తోంది. తనను అన్యాయంగా జెలులో పెట్టిన కాంగ్రెసుతో తాను కలిసి వెళ్లేది లేదని కూడా హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అటు కమ్యూనిస్టులకు, ఇటు కాంగ్రెసుకు కూడా మింగుడు పడడంలేదు. అవసరమైతే, జగన్‌తో వెళ్దామని భావించిన కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు భేటీని తీవ్రంగా తప్పు పట్టాయి.

పవన్ కల్యాణ్‌పై ఇలా...

పవన్ కల్యాణ్‌పై ఇలా...

పనిలో పనిగా జగన్ పుండు మీద కారం చల్లినట్లు చెబుతున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని జగన్ మోడీకి ఫిర్యాదు చేశారని అంటున్నారు. పవన్ కల్యాణ్ విషయంలో చంద్రబాబు పాత్రపై ఉన్న అనుమానాలను జగన్ మాటలు పెంచినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, బిజెపితో జగన్ స్నేహానికి పునాది పడినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu is unhappy with the meeting between PM narendra Modi and YSR Congress party president YS Jagan.
Please Wait while comments are loading...