దూరం: హరికృష్ణ, పురంధేశ్వరి ఏం చేస్తారు?

చంద్రబాబు తనను పిలవకపోవడంపై హరికృష్ణ తన సన్నిహితుల వద్ద తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. సమైక్య నినాదం వినిపించడం వల్లనే తాను సమావేశానికి ఆహ్వానించలేదని ఆయన అన్నట్లు తెలుస్తోంది. కాగా, పురంధేశ్వరితో పాటు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు.
దగ్గుబాటి దంపతులతో కలిసి హరికృష్ణ భవిష్యత్తు కార్యాచరణ తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగానే కాకుండా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తనను అధిష్టానం పెద్దలు ఫోన్ చేసి అడగడంపై కూడా పురంధేశ్వరి తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో ఆమె తిరిగి కాంగ్రెసు పార్టీకి వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది.
విశాఖ నుంచి పోటీ చేయడానికి పురంధేశ్వరికి ఆటంకాలు ఏవీ లేవని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి చెప్పారు. కాంగ్రెసు నుంచి రాజీనామా చేయకుండా ఉండడానికే ఆయనతో కాంగ్రెసు అధిష్టానం ప్రకటన చేయించినట్లు తెలుస్తోంది. ఆయినా పురంధేశ్వరి మనసు మార్చుకోలేదు. నిర్దిష్టమైన వ్యూహరచనతోనే దగ్గుబాటి దంపతులు రాజీనామాలు చేసినట్లు భావిస్తున్నారు.
దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో చేరవచ్చుననే అభిప్రాయం బలంగా వినిపించింది. అయితే, విభజన విషయంలో కాంగ్రెసుతో సమానంగా బిజెపి నిందలు మోస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న దగ్గుబాటి దంపతులు గానీ హరికృష్ణ గానీ బిజెపిలో చేరుతారా అనేది సందేహంగానే ఉందని అంటున్నారు.
సమైక్య నినాదాన్ని తీసుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వారు కలిసి నడుస్తారా అనేది కూడా తెలియడం లేదు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని గతంలో హరికృష్ణ మండిపడ్డారు. అంటే, ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే ఆలోచనలో లేరని అంటున్నారు. హరికృష్ణ, దగ్గుబాటి దంపతుల భవిష్యత్తు రాజకీయాలపై ఏ విధమైన సంకేతాలూ అందడం లేదు.












Click it and Unblock the Notifications