టీడీపీలో కన్నా చేరికపై బీజేపీ మౌనం ! కొత్త అనుమానాలు ! పొత్తు లేనట్లేనా?
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇవాళ టీడీపీలో చేరిపోయారు. అంతే కాదు వెళ్తూ వెళ్తూ పార్టీలోని పలువురు కీలక నేతల్ని తన వెంట తీసుకెళ్లిపోయారు. అయినా బీజేపీ నుంచి స్పందన లేదు. మామూలుగా అయితే కన్నా స్ధాయి నేత పార్టీని వీడి వెళ్లిపోతే వెంటనే విమర్శలకు దిగాల్సిన బీజేపీ.. వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

మందీ మార్బలంతో టీడీపీలోకి కన్నా
ఏపీలో బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీలో చేరిపోయారు. ఆయనతో పాటు కుమారుడు నాగరాజు, తురగా నాగభూషణం, అడపా నాగేంద్ర, మరికొందరు కీలక నేతలు కూడా కన్నా వెంట టీడీపీలోకి వెళ్లిపోయారు. బీజేపీకి గుడ్ బై చెప్పినప్పుడే ఆయన టీడీపీలోకి వెళ్తారని ఊహించినా, భారీ స్ధాయిలో నేతల్ని కూడా పట్టుకుపోతారని సొంత పార్టీతో పాటు చేర్చుకుంటున్న పార్టీ కూడా ఊహించలేదు.
అయినా జరగాల్సింది జరిగిపోయింది. కానీ ఇక్కడ ఇంతమంది పార్టీ నేతల్ని కన్నా వంటి సీనియర్ నేత ప్రత్యర్ధి పార్టీలోకి తీసుకుపోయినా బీజేపీ నుంచి కనీస స్పందన కరవైంది.

టీడీపీలో కన్నా చేరికపై బీజేపీ మౌనం
ఐదుసార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు మంత్రిగా పనిచేసి, కాపు సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి వెళ్లిపోతుంటే పట్టించుకునే వారే కరువయ్యారు. అంతే కాదు ఆయన టీడీపీలో చేరుకుంటే అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు.
టీడీపీలో చేరికను స్వాగతించకపోయినా కనీసం విమర్శలు కూడా చేయకుండా కాషాయ నేతలు మౌనంగా ఉండిపోయారు. కన్నా గురించి ఏమైనా మాట్లాడితే ఆయనకు మైలేజ్ అవుతుందని అనుకున్నారో ఏమో.. టీడీపీలో కన్నా చేరికపై బీజేపీ పూర్తిగా మౌనం వహించింది.

టీడీపీ-బీజేపీ పొత్తు లేనట్లేనా?
వాస్తవానికి రాష్ట్రంలో మరోసారి టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు పొడిచే అవకాశాలున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. నాలుగేళ్లుగా బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు ప్రధాని మోడీ కరుణించారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో అడక్కపోయినా ఎన్డీయే అభ్యర్ధి ముర్ముకు మద్దతిచ్చిన చంద్రబాబును మోడీ తిరిగి ఆదరించడం మొదలుపెట్టారు.
అలాగని వెంటనే పొత్తు పెట్టుకునే వరకూ వెళ్లలేదు. కానీ ఢిల్లీలో అపాయింట్ మెంట్లు దొరికే పరిస్దితి ఉంది. అలాగే తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి.
ఇలాంటి తరుణంలో బీజేపీ నుంచి ఓ కీలక నేత మందీ మార్బలంతో టీడీపీలోకి వెళ్లిపోతుందా కాషాయ నేతలు కనీసం స్పందించలేదంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండట్లేదా అన్న చర్చ మొదలైంది. అలాగైనా టీడీపీపై విమర్శలు చేయొచ్చు. కానీ అదీ జరగలేదు. దీంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి.












Click it and Unblock the Notifications