బాబు! కెసిఆర్‌ని అడగలేవా: గొంతు చించుకున్న జగన్, జనాన్ని చూసి తగ్గిన పోలీస్
మాచర్ల/అనంతపురం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాజెక్టుల పేరుతో నీటిని తోడుకుంటుంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని వైసిపి అధినేత జగన్ అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరాయా అని జగన్ గట్టిగా అరిచి ప్రశ్నించారు. మాచర్లలో కరువు దీక్షలో ఆయన పాల్గొన్నారు.

చంద్రబాబు సీఎం అయ్యాక పంగనామాలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆదివారం మాచర్లలో వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించిన కరవు ధర్నాలో పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో పలువురు ధర్నాలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం తీసిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.
రైతులకు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు పంగనామాలు పెట్టారన్నారు. ప్రజలు కరవుతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
కరువు తీవ్రతతో రైతులు, ప్రజలు వలసలు పోతున్నారన్నారు. వారికి ఉపాధి పనులు ఇవ్వాలని, కానీ ఇవ్వడం లేదన్నారు. ఉపాధి పనుల కోసం కేంద్రం రూ.4,500 కోట్లు ఇచ్చిందని, కానీ వాటిని చంద్రబాబు మరో వాటికి ఖర్చు చేస్తున్నారన్నారు.

నీరు - చెట్టుకు రూ.2500 కోట్లు, రూ.వెయ్యి కోట్లు సిమెంట్ రోడ్డుకు ఖర్చు చేశారన్నారు. రోడ్లు వేయవద్దని తాను చెప్పడం లేదని కానీ, ఉపాధి డబ్బులను పక్కదారి పట్టిపట్టించడం ఏమిటని ప్రశ్నించారు. మన పక్కనే నాగార్జున సాగర్ ఉందని, కానీ నీళ్లు దొరకని పరిస్థితి ఉందన్నారు.
ఈ సందర్భంగా జగన్ ఖాళీ కుండను చూపించి నిరసన తెలిపారు. ఇప్పుడు శ్రీశైలంలో నీళ్లు లేవని, అది నిండితే కానీ నాగార్జున సాగర్‌కు నీళ్లు రావని, సాగర్ నిండితే మన ఆయకట్టుకు నీళ్లు రావన్నారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టులోను నీళ్లు లేవన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు ఎలా ఇవ్వాలని చంద్రబాబు ఆలోచించడం లేదన్నారు.
కెసిఆర్ నీరు తోడుకుపోతున్నా...
తెలంగాణ సీఎం కెసిఆర్ రంగారెడ్డి - పాలమూరు ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టులు కట్టి నీరు తోడుకొని పోతుంటే చంద్రబాబు అడగడం లేదన్నారు. చంద్రబాబును కేసీఆర్‌ను నిలదీయలేరన్నారు. ఎందుకంటే ఓటుకు నోటు కారణమన్నారు. ఓటుకు నోటును బయటకు తీస్తారనే నీటిని అడగడం లేదన్నారు.
రాయలసీమకు దక్కాల్సిన నీటి పైన తెలంగాణ సీఎం కెసిఆర్‌ను అడిగే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు పుణ్యాన ఈ రోజు రైతులు, పేదవాడు అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదన్నారు.

రుణాలు మాఫీ కాకపోవడమే కాకుండా.. బాబు ఇచ్చిన రుణాలు వడ్డీకి కూడా సరిపోవడం లేదన్నారు. చంద్రబాబును డ్వాక్రా అక్కా చెల్లెళ్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పారని, నిరుద్యోగ భృతి అని చెప్పారని, కానీ ఏదీ నెరవేర్చలేదన్నారు.
రైతులకు రుణాలు మాఫీ అయ్యాయా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వస్తోందా? ఉద్యోగాలు వచ్చాయా? అందరికీ ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు చెప్పారు.. కట్టించారా? అని జగన్ గట్టిగా గొంతు చించుకొని సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మోసమే అన్నారు.
ఎమ్మెల్యేల్ని కొంటున్న బాబును బంగాళాఖాతంలో కలిపేద్దాం
ఇన్ని తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబును క్షమించవద్దన్నారు. చంద్రబాబు ప్రజల గొంతు, ప్రతిపక్షాల గొంతు వినపడకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. సంతలో గొర్రెల్ని కొన్నట్లు ఎమ్మెల్యేల్ని కొంటున్నారన్నారు. అందరం ఒక్కటై చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామన్నారు.
జగన్ ర్యాలీపై అంతకుముందు టెన్షన్
మాచర్లలో హైటెన్షన్ తప్పదన్న వాదనను వైయస్ జగన్ తన జనహోరుతో తిప్పికొట్టారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురుకాకుండానే తన పోరుబాటను ముగించారు. కరువుపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన పోరుబాటలో భాగంగా ఆ పార్టీ అధినేతగా గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన నిరసనకు జగన్ హాజరయ్యారు.
సోమవారం ఉదయం రోడ్డు మార్గం మీదుగా హైదరాబాదు నుంచి బయలుదేరిన జగన్... కొద్దిసేపటి కాసేపటికి మాచర్లకు చేరుకున్నారు. పట్టణంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న జగన్... తనకు మద్దతుగా ర్యాలీకి తరలివచ్చిన జనసంద్రాన్ని చూసి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

అయితే జగన్ ర్యాలీకి, నిరసనకు అనుమతి లేదని పోలీసులు తొలుత తెలిపారు. దాదాపుగా ర్యాలీని అడ్డుకునేందుకే సమాయత్తమయ్యారు. జగన్ అక్కడికి చేరుకునేసరికే పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. అయితే ఇవేమీ పట్టించుకోని జగన్... ర్యాలీలో పాల్గొన్నారు. జగన్ నిరసనకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో మాచర్ల జనసంద్రంగా మారింది. దీనిని అడ్డుకోవడం అసంభవమని భావించి తగ్గినట్లుగా తెలుస్తోంది.
జగన్ పార్టీ మునిగే నావ: పల్లె
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం నాడు మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు తిరస్కరించినా ఆయనకు జ్ఞానోదయం కాలేదన్నారు. అధికారంలోకి వచ్చి దోచుకోవాలనే ఆలోచనతోనే జగన్ ఉన్నారని మండిపడ్డారు. జగన్ పార్టీ మునిగే నావ అన్నారు.
కాగా, గుంటూరు జిల్లా మాచర్ల ధర్నాలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు మగపుట్టుక పుట్టి ఉంటే, పౌరుషానికి ప్రతీక అయిన రాయలసీమ గడ్డ మీద పుట్టి ఉంటే, చీము రక్తం ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పేరుతో గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబు ఎంగిలి మెతుకులు తింటున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications