చంద్రబాబు "రాజకీయం" సమర్ధించని పవన్ - ఏం జరుగుతోంది..!?
టీడీపీ -జనసేన మధ్య ఏం జరుగుతోంది. వరుసగా మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు గెలుపుతో టీడీపీ జోష్ లో ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమంటూ అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ మౌనం పాటిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు పైన ఆలస్యంగా స్పందించిన పవన్.. ఎమ్మెల్యే కోటాలో టీడీపీ విజయం పైన ఇప్పటి వరకు స్పందించ లేదు. ఈ ఎన్నికలో గెలిచేందుకు చంద్రబాబు నడిపిన రాజకీయం పవన్ కు నచ్చలేదా. వైసీపీ ఓడినా..టీడీపీ గెలిచిన విధానం సమర్ధించలేకా...ఎందుకీ మౌనం.
వైసీపీని రాజకీయంగా దెబ్బ కొట్టిన జోష్ లో టీడీపీ ఉంది. ఇక అన్ స్టాపబుల్ అంటూ చంద్రబాబు హ్యాపీ మూడ్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకపోయినా విజయం తమదేనంటూ టీడీపీ నేతలు ధీమావ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమి కోరుకొనే జనసేనాని పవన్ కల్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే పొత్తు అవసరమని పదే పదే చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో తాము బీజేపీతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూనే..టీడీపీతో జత కట్టటం పైన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని ఈ రెండు పార్టీలతో పాటుగా అధికార వైసీపీ కూడా డిసైడ్ అయిది. ఈ సమయంలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.

పట్టభద్రుల నియోజకర్గ ఎన్నికల్లో జనసేన నేతలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కానీ, ఎవరికి ఓటు వేయాలో చెప్పలేదు. ఇదే అంశాన్ని బీజేపీ నేతలు పవన్ ను కొద్ది రోజుల క్రితం ప్రశ్నించారు. జనసేన నుంచి సమాధానం లేదు. పట్టభద్రుల నియోజకవర్గంలో చంద్రబాబు చివరి నిమిషంలో లెఫ్ట్..పీడీఎఫ్ తో అవగాహణ కుదుర్చుకున్నారు. అది మంచి ఫలితం ఇచ్చింది. ఉత్తరాంధ్ర, రెండు సీమ నియోజకవర్గాల్లోనూ టీడీపీ రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించింది. దీని పైన టీడీపీ సంబరాలు చేసుకుంది. వైసీపీ ఓడినా..పవన్ ఆలస్యంగా స్పందించారు. టీడీపీ గెలుపును స్వాగతించారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు. పవన్ తో ఈ ఎన్నికల్లో పొత్తు లేకపోయినా..టీడీపీ నేతలు మాత్రం పవన్ కు క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేసారు. పవన్ కల్యాణ్ పిలుపు కారణంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేదంటూ గంటా కొత్త విశ్లేషణ చేసారు.
ఇక..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసారు. అనూహ్యంగా టీడీపీ అనూహ్యంగా విజయం సాధించింది. కానీ, ఇప్పటి వరకు టీడీపీ ఈ ఎన్నికల్లో గెలవటం పైన పవన్ స్పందించలేదు. అటు వైసీపీ నేతలు చంద్రబాబు డబ్బులు..ప్రలోభాలతో తమ నలుగురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు..పవన్ ఈ ఫలితం పైన ఎందుకు స్పందించలేదనేది చర్చగా మారింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను ట్రాప్ చేయటం పవన్ కు నచ్చలేదా...ఈ తరహా రాజకీయానికి తాను మద్దతివ్వని చెప్పటం పవన్ లక్ష్యమా.. ఈ గెలుపును సమర్ధిస్తే తాను విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణమా..ఇలా పలు అంశాల పైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే చంద్రబాబు రాజకీయానికి పవన్ మద్దతుగా స్పందించలేదనే వాదన ఉంది. మరి..ఈ వాదన పైన జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications