తప్పేం చేశామని..: జగన్‌పై సోమిరెడ్డి, అశోక్‌పై బొత్స
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దీక్ష చేయాలని నిర్ణయించుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఏం తప్పు చేసిందని జగన్ దీక్ష చేస్తారని ఆయన అడిగారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు చక్కదిద్దుతున్నారని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు.
క్విడ్‌ప్రోకోలు లేవు, ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని ఆయన అన్నారు. 24 గంటలు విద్యుత్తు పంపిణీ చేయడం చంద్రబాబు పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇసుక, ఎర్రచందన మాఫియాలను అడ్డుకుంది చంద్రబాబేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రతిపాదించిందని ఆయన గుర్తు చేశారు.

డబ్బులు ఎక్కువై జగన్ దీక్ష చేస్తున్నారా, జగన్ దీక్షకు అర్థం ఉందా అని సోమిరెడ్డి అడిగారు. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉందని ఆయన చెప్పారు. విశాఖను స్మార్ట్ సిటీగా ప్రకటింపజేయించింది చంద్రబాబేనని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు సాధనలో చంద్రబాబుది కీలక పాత్ర అని ఆయన చెప్పారు. హోండా కంపెనీని రాష్ట్రానికి తీసుకుని వచ్చింది కూడా చంద్రబాబేనని చెప్పారు. పవర్ హాలిడే లేకపోవడం జగన్‌కు కష్టంగా ఉందా అని అడిగారు. హుధుద్ తుఫానును చంద్రబాబు సమర్థంగా ఎదుర్కున్నారని ఆయన చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉంటుందా, ఉండదా అనే అనుమానం ఆ పార్టీ నాయకుల్లోనే ఉందని, జగన్ చేసిన ఆరోపణలు అర్థరహితమని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలనలో వేల కోట్ల రూపాయల ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందని, ఇసుక మాఫియాను తయారు చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు.
దమ్ముంటే నిరూపించండి
దమ్ముంటే తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి వాటిని నిరూపించాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ నాయకుడు, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును సవాల్ చేశారు. హుధుద్ తుఫానుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆలస్యంగా విజయనగర జిల్లాకు వచ్చి అశోక్ గజపతి రాజు మొక్కలు నాటుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అశోక్ గజపతిరాజులో రాచరికపు పోకడలు పోలేదని ఆయన అన్నారు. తెలుగు తమ్ములల దోపిడీ ప్రారంభమైందని విమర్శించారు.












Click it and Unblock the Notifications