బాబుపై ఆధారాలు?: గవర్నర్‌కు కేసీఆర్, స్టీఫెన్‌కు ప్రాణహానీ అని టీడీపీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకు ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయని, వీటిపై ఏమి చేద్దామన్న అంశంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్‌తో చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారమని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఇదే అంశంపై అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి కూడా విడివిడిగా గవర్నర్‌ను కలుసుకోవడం గమనార్హం.
ఓటుకు నోటు ఉదంతంలో చంద్రబాబుకు ప్రమేయం ఉందని ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించగా, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసు ఉన్నతాధికారులు గవర్నర్‌కు అందజేసినట్టుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
అయితే ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసింది ఈ నెల 7వ తేదీన జరుగబోయే రాష్ట్ర ఆవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించడానికి మాత్రమేనని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్పాయి. అందుకే ముఖ్యమంత్రి తన వెంట జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్‌ను వెళ్లారని చెబుతున్నాయి.

స్టీఫెన్ సన్‌కు ప్రాణహాని: తెలంగాణ టీడీపీ
కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో కేసీఆర్ కుట్ర పన్ని రేవంత్ రెడ్డిని ఇరికించారని తెలంగాణ టీడీపీ నేతలు సీతక్క, నర్సిరెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు శుక్రవారం మండిపడ్డారు. స్టీఫెన్ సన్‌కు కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు.
సీతక్క మాట్లాడుతూ.. కేసీఆర్ అక్రమాలను ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో అడుగడుగునా అవమానించారని, ఇప్పుడు కేసులో ఇరికించారన్నారు. కేసీఆర్ అధికార, కుల బలంతో టీడీపీ ఎమ్మెల్యేలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి కేసు కోసం రాత్రికి రాత్రి ప్రత్యేక పీపీని నియమించడం రేవంత్‌పై కేసీఆర్‌కున్న అక్కసుకు నిదర్శనమన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్న కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు.
రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను రాజకీయంగా అణచివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ నిర్దోషిగా బయటకు వస్తారన్నారు.
కేసీఆర్ కుతంత్రాల చంద్రశేఖర రావుగా మారిపోయారని అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. స్టీఫెన్ సన్‌తో కలిసి కుట్రపన్ని రేవంత్‌ను ఇరికించారన్నారు. ఆయన్ను అంతం చేసి, దాన్ని విపక్షాలపైకి నెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించే అవకాశం ఉందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కేసీఆర్ వంద కోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని టీడీపీ నాయకుడు ఒంటేరు ప్రతాప రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలకు వంద కోట్లు ఇచ్చిన కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications