YS Jagan : ఏపీలో ముందస్తుపై మళ్లీ చర్చ-జగన్ ఢిల్లీ టూర్ వేళ-ప్రధాని స్పందనే కీలకం ?
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, ఇతర కేంద్రమంత్రుల్ని ఆయన కలవబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై ఆయన చర్చించబోతున్నారు. అయితే ఇవి జగన్ ప్రతిసారీ ఢిల్లీ టూర్ లో చేసేవే. కానీ ఈసారి మాత్రం ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోడీతో జగన్ చర్చించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని వెనుక చాలా కీలక కారణాలు ఉన్నాయి.

ఢిల్లీలో వైఎస్ జగన్
సీఎం జగన్ ను ఆకస్మికంగా ఢిల్లీ రావాలని కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి రెండు రోజుల క్రితం సమాచారం అందింది. దీంతో జగన్ నిన్న సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి ఢిల్లీలోని అధికారిక నివాసం 1 జన్ పథ్ లో బస చేసిన జగన్, ఇవాళ ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రుల్ని కలుసుకోబోతున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఇదంతా ఎప్పుడూ ఉండేదే అయినా ఈసారి మాత్రం ఒకట్రెండు కీలక అంశాలపై జగన్ కచ్చితంగా చర్చించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అవి ఏపీ రాజకీయాలకు ఓ టర్నింగ్ పాయింట్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ముందస్తు ఎన్నికలు ?
ఏపీలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో చేయిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం త్వరలో పూర్తి కానుండమే. కొత్త ఏడాది మార్చిలో ఈ కార్యక్రమం ముగియగానే ఆ హీట్ లోనే ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా చూసుకుంటే చాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో ముందస్తు ఎన్నికలపై జగన్ తీసుకోబోయే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కేంద్రం మద్దతు లేకుండా మాత్రం జగన్ ముందడుగు వేసే పరిస్ధితి ఉండదు కాబట్టి, ప్రధాని మోడీతో ఇవాళ ఈ అంశంపై జగన్ చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ముందస్తుకు ప్రధాని ఒప్పుకుంటారా ?
ఏపీలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోడీతో భేటీలో సీఎం జగన్ కచ్చితంగా చర్చిస్తారనే వాదన వినిపిస్తోంది. అయితే గతంలోనూ పలుమార్లు ప్రధానితో జగన్ భేటీ అయిన సందర్భంగా ఆయన్ను మోడీ వారించినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఎప్పటికప్పుడు ముందస్తు నిర్ణయాన్నివాయిదా వేస్తున్న జగన్, ఈసారి మాత్రం కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోడీకి చెప్పేస్తారనే చర్చ జరుగుతోంది. దీన్ని అధికారికంగా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ధృవీకరించకపోయినా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం చర్చ జోరుగా సాగుతోంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని స్పందన కీలకంగా మారింది.

తోసిపుచ్చుతున్న వైసీపీ ?
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతోంది. రాష్ట్రంలో ప్రజలు తమకు ఐదేళ్ల అధికారం ఇచ్చారని, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని చెబుతోంది. అయితే క్షేత్రస్దాయిలో పరిస్దితులు క్రమంగా మారుతున్నాయన్న నివేదికలు ప్రభుత్వానికి అందుతున్నాయి. దీంతో ముందస్తుపై పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్, బీజేపీ జట్టు కట్టక ముందే ముందస్తుపై నిర్ణయం తీసుకుంటే వారికి అవకాశం లేకుండా చేయొచ్చని అధికార వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ పైకి మాత్రం సకాలంలోనే ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications