హిందూపురం: బాలకృష్ణ కోసం భార్యాబిడ్డలు ప్రచారం
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ఆనయ కుటుంబ సభ్యులు ప్రచారంలోకి దిగారు. బాలయ్య సతీమణి వసుంధర ఇప్పటికే ప్రచారం సాగిస్తుండగా, తాజాగా చిన్న కూతురు తేజస్విని, అల్లుడు భరత్ ప్రచారంలోకి అడుగు పెట్టారు.
బాలయ్య కుటుంబ సభ్యులు స్థానిక నేతలతో కలిసి చిలమత్తేరు మండలంలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. మండలంలోని దేవకేశిపల్లిలో ఇంటింటికీ తిరుగుతూ బాలకృష్ణను గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలావుంటే, బాలకృష్ణ అత్మకూరు మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఎన్టీఆర్ ప్రజల్లోకి వచ్చి గర్జిస్తే ఢిల్లీ పడిపోయిందని, ఈ రోజు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోందని బాలకృష్ణ అన్నారు. హిందూపురం ఎంపి అభ్యర్థి నిమ్మల కిష్టప్ప కూడా బాలకృష్ణతో పాటు రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెసు అవినీతిని ఎండగట్టి అరాచకాలను ఎదుర్కున్న తమ పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
కల్యాణదుర్గంలో వేల కోట్లు తినేసిన రఘువీరా రెడ్డి అక్కడ గెలవలేననే భయంతో పెనుకొండకు వచ్చి పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు చేతివృత్తులవారికి మంచి రోజులు రావాలంటే తమ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. బాలకృష్ణకు అబిమానులు గొర్రెపిల్లను బహూకరించారు.












Click it and Unblock the Notifications