ఏపీలో బీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ ? చంద్రబాబు చేయలేని పని కేసీఆర్ ! జగన్ పై ప్రభావమెంత ?
ఏపీలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. దాంతో పాటే దాని లక్ష్యం కూడా ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని త్వరలో ఏపీలోనూ అమలు చేసే దిశగా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.తద్వారా ఓవైపు బీజేపీకి, మరోవైపు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాల్నీ బుజ్జగిస్తున్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు వీలవుతుందనేది గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ ఎంట్రీతో..
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ రాష్ట్ర రాజకీయాల్ని మార్చబోతోంది. ఇప్పటివరకూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కనిపిస్తున్న రాజకీయ పార్టీల పునాదుల్ని కదిలించేలా, మరికొన్ని పార్టీల ఓటు బ్యాంకుల్ని చెల్లాచెదురు చేసేలా కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ రాకపై ఇప్పుడు అధికార వైసీపీతో పాటు విపక్షంలోని టీడీపీ, జనసేన,బీజేపీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ జాతీయ విధానం ప్రకటన తర్వాత రాష్ట్రంలో రాజకీయం డిసైడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు బీఆర్ఎస్ తో పొత్తుల వ్యూహాలపైనా రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి.

బీజేపీతో అంటకాగుతున్న పార్టీలకు గుబులు ?
ఇప్పటికే ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్షంలోని టీడీపీ, జనసేన అంటకాగుతున్నాయి, లేదా అంటకాగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రం మద్దతు లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేయలేమనే అంచనాకు వచ్చేయడమే. ఇప్పుడు ఈ భావనకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ ఎంట్రీ ఉండబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీకి మద్దతిస్తున్న పార్టీల గుండెల్లో గుబులు రేపేలా, ముఖ్యంగా డబుల్ గేమ్ ఆడుతున్న పార్టీల రాజకీయానికి చెక్ పెట్టేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

వైసీపీ-బీజేపీ బంధంపై ప్రభావం ?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తప్పనిసరి బంధాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర అవసరాల కోసమే ఈ బంధం కొనసాగిస్తున్నట్లు వైసీపీ చెప్పుకుంటున్నా.. జగన్ కేసుల నుంచి ఊరట కోసమే ఈ బంధం కొనసాగిస్తున్నట్లు విపక్షాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాకతో వైసీపీ-బీజేపీ బంధంపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీని బీఆర్ఎస్ టార్గెట్ చేసే క్రమంలో వైసీపీ కూడా టార్గెట్ కావడం ఖాయమనే అంచనాలున్నాయి. దీంతో బీఆర్ఎస్ తో ఎలా వ్యవహరించారనే దానిపై వైసీపీ కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

జగన్ కు ముస్లింల్ని దూరం చేసేలా ?
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ తర్వాత వైసీపీ-బీజేపీ ఇద్దరినీ టార్గెట్ చేసే ప్రయత్నాలు ముమ్మరం కావడం ఖాయం. అందులో భాగంగా బీజేపీని నేరుగా టార్గెట్ చేయబోతున్న కేసీఆర్.. అనంతరం ఆ పార్టీకి వ్యతిరేకులుగా ఉన్న ముస్లింలను ఏకం చేసి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టడం కూడా ఖాయం. వీరంతా ఇప్పుడు జగన్ కు మద్దతుగా ఉన్నారు. వీరిని తమవైపు తిప్పుకునేందుకు కేసీఆర్.. అవసరమైతే ఓవైసీ సాయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా జగన్ కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న కీలక వర్గాన్ని బీజేపీ బూచి చూపించి వైసీపీకి దూరం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకూ చంద్రబాబు కూడా ఈ వ్యూహం అమలు చేయలేకపోయారు. దీనికి కారణం ఆయన కూడా బీజేపీవైపు పలుసార్లు మొగ్గడం,ఇప్పుడు మరోసారి ఆ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుండమే.












Click it and Unblock the Notifications