తెరవెనుక చంద్రబాబు?: సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి రాకుండా చేస్తున్నారా?
అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు పదవీ కాలం ముగిసి రెండు నెలలకుపైగా అయింది. దేశవ్యాప్తంగా దాదాపు 24 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ముగిసినప్పటికీ ఏపీలో మాత్రం ఆగిపోయింది. అసలు ఈ స్ధానంలో ఎవరిని నియమించాలో తెలియక బీజేపీ అధిష్టానం తికమకపడుతోందా?
లేదంటే ఏమైనా ప్రత్యేకమైన కారణాలున్నాయా అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక సజావుగా జరగక్కుండా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావాలనే అడ్డుకుంటున్నారని సమాచారం.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల దేశంలో నాలుగైదు రాష్ట్రాలు మినహా బీజేపీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్ష నియామకాలను పూర్తి చేసింది. ఇటీవలే అంబర్ పేట ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ను నిమయించిన సంగతి తెలిసిందే.
అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత లక్ష్మణ్ తెలంగాణలో బీజేపీ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇటీవలే నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అతిధిగా భారీ బహిరంగ సభనే నిర్వహించారు. ఇదే విధంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు పదవీ కాలం ముగిసి రెండు నెలలకుపైగా అయింది.
ఆయన పదవీ కాలం పూర్తికావడంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే దానిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంస్థాగతంగా అన్నీ సిద్ధం చేసినట్లు మీడయాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్ష రేసులో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, చల్లపల్లి నరసింహ రెడ్డి తదితరుల పేర్లు వినిపించాయి.
అయితే బీజేపీ అధిష్టానంతో పాటు మెజారిటీ పార్టీ నేతలు సోము వీర్రాజునే అధ్యక్షుడిని చేయాలని నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో ఆయన పేరుని ప్రకటించకుండా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ వాయిదా వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు సమాచారం.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించకుండా చంద్రబాబునాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు కమలం వర్గాల్లో బాగా వినిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నందున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన కనుసన్నల్లో తనమాట వినేవారినే నియమించేలా చూసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
2014 సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ-జనసేనల మధ్య పొత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన సోము వీర్రాజు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబు వ్యవహారశైలిని సైతం ఆయన తప్పుపడుతున్నారు.
ఈ విషయమే సీఎం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమిస్తే మిత్రపక్షాల మధ్య సమస్యలు తలెత్తుతాయని బీజేపీ అధిష్టానం వద్ద చెప్పి చివరి నిమిషంలో ఆయన నియామకాన్ని అడ్డుకున్నారని కమలనాథులు చెబుతున్నారు.
దీనికి తోడు సోము వీర్రాజు టీడీపీ ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. అలాంటి నేతను పార్టీ అధ్యక్షుడిని చేస్తే మిత్రపక్షాలైన బీజేపీ-టీడీపీల మధ్య సంబంధాలు బెడిసికొడతాయని బీజేపీ అధిష్టానం వద్ద టీడీపీ నేతలు వినిపించారంట.
తాజాగా తెరపైకి బీజేపీ అధ్యక్ష రేసులో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరుని తీసుకొచ్చారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కామినేని తనకు ఎంతో అనుకువగా, అనుకూలంగా ఉంటారని... కాబట్టి కామినేని శ్రీనివాస్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేయాలని చంద్రబాబు బీజేపీకి చెందిన ఓ జాతీయ స్థాయి నేతకు చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications