జూనియర్ ఎన్టీఆర్ ఆరాటం: బాలయ్యకు చేరువ?
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారా, లేదంటే తమ దూరం లేదని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అనే ఆసక్తి నెలకొంది. ఇరువురి మధ్య విబేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. బాలకృష్ణ ఆరోగ్యానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు ఆ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అభిమానులు కంగారుపడవద్దని, బాబాయ్ క్షేమంగా ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మళ్లీ సింహం గర్జిస్తుందని కూడా ఆయన అన్నారు. బాబాయ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శుక్రవారం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఓ చిత్రం షూటింగ్‌లో బాలకృష్ణ బైక్ మీంచి జారి పడి స్వల్పంగా గాయపడ్డారు. ఆయనకు ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి పంపించారు. ఆయనకు రెండు మూడు రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు.

మామయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పించి కొడాలి నానికి 2009లో అసెంబ్లీ టికెట్ ఇప్పించిన తనకు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంతో జూనియర్ ఎన్టీఆర్‌కు, బాలయ్యకు మధ్య విభేదాలు పెరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ కటౌట్స్ విషయంలో బాలకృష్ణ గతంలో బహిరంగంగానే హెచ్చరిక చేశారు.
దానికితోడు, చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌తో జూనియర్ ఎన్టీఆర్ వారసత్వ పోరును తెర మీదికి తెచ్చారు. దీంతో చంద్రబాబు నాయుడు కూడా జనియర్ ఎన్టీఆర్‌కు దూరమయ్యారు. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు గానీ బాలయ్య గానీ 2014 ఎన్నికల్లో ప్రచారానికి ఆహ్వానించలేదు. పిలిస్తే తాను పార్టీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రభస చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ స్థితిలో బాలయ్య అభిమానులను పోగొట్టుకోవడం ఎన్టీఆర్‌కు ఇష్టం లేదని అంటున్నారు. దీంతో బాలకృష్ణకు చేరువ కావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎలా స్పందిస్తారో గానీ తనను ప్రశ్నించినవారిని తిరిగి దగ్గరకు చేర్చుకునే తత్వం చంద్రబాబుది కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications