విభజనపై కిరణ్ రెడ్డి ప్లాన్: జగన్, బాబు కలుస్తారా?
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా అనేది ప్రశ్నే. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులను కూడగట్టి పార్టీలకు అతీతంగా విభజనను అడ్డుకోవడానికి పనిచేయాలని కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించారు. ఈ వ్యూహాన్ని సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు ఆమోదించారు. ఇతర పార్టీల శాసనసభ్యులను కలుపుకుని వచ్చే బాధ్యతను కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు సీనియర్ మంత్రులకు అప్పగించారు.
సీమాంధ్రకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, గంటా శ్రీనివాస రావు ఇతర పార్టీ సీమాంధ్ర శాసనసభ్యుల మద్దతు కూడగట్టాల్సి ఉంది. అయితే, తమకు ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన ఏదీ రాలేదని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకుడు పయ్యావుల కేశవ్ చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల శాసనసభ్యుల మద్దతు పొందాలంటే తప్పనిసరిగా ఆ పార్టీల అధ్యక్షులు జగన్, చంద్రబాబు ప్రమేయం లేకుండా జరిగేది కాదు.

కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ముసుగులో విభజనకు సహకరిస్తున్నారని ఇరు పార్టీల నాయకులు కూడా విమర్శిస్తున్నారు. కాంగ్రెసు సీమాంధ్ర నాయకులతో కలిసి పనిచేస్తే సమైక్యాంధ్ర చాంపియన్‌గా కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో చంద్రబాబు గానీ, వైయస్ జగన్ గానీ తమ పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులకు కాంగ్రెసు సీమాంధ్ర మంత్రులతో కలిసి పనిచేసే అవకాశాన్ని ఇవ్వకపోవచ్చునని అంటున్నారు.
విభజన తీరును తప్పు పడుతున్న చంద్రబాబు నేరుగా ముందుకు వచ్చి విభజనను అడ్డుకోవడానికి రంగంలోకి దిగే అవకాశాలు లేవు. విభజనను ఆపాలని ఆయన అంటున్నప్పటికీ ఆచరణలో దాన్ని ఆపడానికి సిద్ధంగా లేరు. వైయస్ జగన్ రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని చెబుతున్నా, అలా అడ్డుకోవడానికి జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నా కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అందుకు సిద్ధపడే అవకాశాలు లేవు.
నిజానికి, రాష్ట్ర విభజన ఆగేది లేదనే విషయం అందరికీ అర్థమైపోయింది. చంద్రబాబు, జగన్, కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో పట్టు కోసం పోటీ పడుతున్నారనే అభిప్రాయం ఈ స్థితిలో బలంగా నాటుకుని ఉంది. సీమాంధ్ర చాంపియన్‌గా నిలబడాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్న తరుణంలో వారి మధ్య సమైక్యం సాధ్యమయ్యే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు సోమవారమే శాసనసభకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో ఏ పార్టీ శాసనసభలో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుకు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసిన తర్వాత శాసనసభలో తీర్మానం చేయాల్సిన స్థితిలో ఆటంకం ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కటై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. అలా అడ్డుకునే కార్యక్రమానికి చంద్రబాబు నాయకత్వం వహించారని కూడా వారన్నారు. అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుందా అనేది సందేహమే.












Click it and Unblock the Notifications