ఆ తల్లులకు లాస్ట్ ఛాన్స్-ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసిన జగన్-ఈసారైనా వింటారా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ ప్రతిష్టాత్మక పథకానికి ఇప్పుడు ఓ కొత్త చిక్కు పడింది. ఆ పథకం అసలు లబ్దిదారులెవరన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైకోర్టు జోక్యంతో ఈ ప్రశ్నలకు సమాధానం లభించినా ప్రభుత్వ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. దీంతో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. ఆ పథకం లబ్దిదారులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆ విజ్ఞప్తిని వారు పట్టించుకోకపోతే మాత్రం వారికి సమస్యలు తప్పేలా లేవు.

ఇబ్బందుల్లో జగన్ మానసపుత్రిక
ఏపీలో అక్షరాస్యత స్ధాయిల్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వాలు కొన్నేళ్లుగా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీని రూపురేఖలు మార్చేశారు. విద్యార్ధుల ఫీజుల్ని కారేజీలకు ఇవ్వడానికి బదులు తల్లుల ఖాతాల్లో వేయడం మొదలుపెట్టారు. దీనికి జగనన్న విద్యాదీవెన పథకం అని పేరు పెట్టారు. దీంతో విద్యార్ధుల తల్లులు ఆ ఫీజులు తమ ఖాతాల్లో పడగానే వాటిని తీసుకెళ్లి కాలేజీలకు కట్టాల్సి ఉంటుంది.. కానీ ఇప్పుడు అలా ఫీజులు తీసుకున్న తల్లుల్లో కొందరు వాటిని తిరిగి కాలేజీలకు కట్టకుండా సొంతానికి వాడేసుకుంటు

కాలేజీలకే ఇమ్మన్న హైకోర్టు
ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద ఇస్తున్న ఫీజుల్ని కొందరు తల్లులు కాలేజీలకు కట్టకుండా సొంత అవసరాలకు వాడేసుకుంటున్న వైనంపై ప్రభుత్వం పట్టించుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదు దీంతో కాలేజీలు నేరుగా హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం ఫీజులు తమకు ఇవ్వకుండా తల్లులకు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపించాయి. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు..ఇకపై ఫీజులు కాలేజీలకే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది. చివరకు ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

మళ్లీ తల్లులకే ఇచ్చిన సర్కార్
జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజుల్ని వారికే నేరుగా ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోలేదు. హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాం కాబట్టి ఇక అంతా తన ఇష్టమే అని భావించింది. దీంతో ఈ ఏడాది మూడో విడత విద్యాదీవెన ఫీజుల్ని మళ్లీ తల్లుల ఖాతాల్లోనే వేసింది. అయితే మూడు వారాల్లోగా వాటిని తల్లులు మీకు చెల్లించకపోతే వారి నుంచి ఎలాగైనా వసూలు చేసుకోవచ్చంటుూ అనుమతి ఇచ్చింది. దీంతో కాలేజీలు కూడా అభ్యంతరం చెప్పలేదు.

తల్లులకు జగన్ వినతి
జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాల్ని తిరిగి కాలేజీలకు ఇచ్చేయాలంటూ తాజాగా సీఎం జగన్ తల్లులకు విజ్ఞప్తి చేశారు. "తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక్క మనవి చేస్తున్నాను. జగనన్న విద్యా దీవెన పేరుతో ఒక మంచి ఉద్దేశ్యంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ అయిన ఈ కాలేజీలకు సంబంధించిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము ఏదైతే మీకు అందుతుందో... అది వారం పదిరోజుల్లోగా కళాశాలకు వెళ్లి, అక్కడ తప్పకుండా ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫీజులు మీకు అందిన తర్వాత కూడా మీరు కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడతలో ఆ ఫీజుల డబ్బులు, మీ ఖాతాలకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ప్రభుత్వంపై ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి తల్లి గుర్తుపెట్టుకోవాలని ప్రతి తల్లి ఒక అన్నగాను, తమ్ముడుగాను గుర్తుపెట్టుకోవాలని వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను.": అంటూ నిన్న విద్యాదీవెన మొత్తాల విడుదల సందర్భంగా జగన్ కోరారు.

ఈసారైనా ఆ తల్లులు వింటారా ?
గతంలో విద్యాదీవెన కింద ఫీజులు తీసుకున్న తల్లుల్లో కొందరు కాలేజీలకు వాటిని తిరిగి చెల్లించకపోవడంతో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈసారి వాటిని ఎలాగైనా కాలేజీలకు కట్టేయాలని తల్లుల్ని కోరారు. మరి ఈసారైనా పూర్తిగా తల్లులువాటిని కాలేజీలకు కట్టేస్తారా అంటే గ్యారంటీ లేదు. ఇప్పటికే ఫీజులు తమ ఖాతాల్లో పడగానే వాటిని ఖర్చుపెట్టడం మొదలుపెట్టేసిన వారు ఉన్నారు. కాలేజీలకు వాటిని కట్టడం కంటే తమకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్న వారు ఉన్నారు. దీంతో ఈసారి కూడా పూర్తిగా తల్లులు కాలేజీలకు ఫీజులు కట్టడం అనుమానంగానే కనిపిస్తోంది. వాస్తవానికి హైకోర్టు ఫీజులు తల్లులకు ఇవ్వాలా , కాలేజీలకు ఇవ్వాలన్న దానిపై తుది తీర్పు రిజర్వులో ఉంచింది. ఆ లోపు తల్లులు కాలేజీలకు ఫీజులు కట్టకపోతే మాత్రం ఈసారి హైకోర్టు పాత తీర్పునే సమర్ధించే అవకాశముంది.












Click it and Unblock the Notifications