ప్రధాని మోదీ ప్రచారం వేళ టీడీపీలో కొత్త టెన్షన్..!!
ఏపీలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. ముఖ్య నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కూటమికి మద్దతుగా ప్రచారం చేసేందుకు ప్రధాని మోదీ రెండు రోజులు ఏపీలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన వేళ కూటమి నేతల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో కొత్త టెన్షన్ మొదలైంది. ప్రధానంగా ఏపీలో ప్రస్తుతం ప్రచారంలో కీలకంగా మారిన రెండు అంశాలు ఈ పర్యటనలో కీలక అంశాలుగా మారుతున్నాయి.
ప్రధాని మోదీ ప్రచారం
రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంపై టిడిపి నాయకుల్లో ఆందోళన నెలకొంది. పోలింగ్‌కు ఐదు రోజులు ముందు పర్యటన ఉండటంతో నేతల్లో ఉత్కంఠకు గురవుతున్నారు. టీడిపి- జనసేనతో బిజెపి కలిసిన తరువాత చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వంటి వాటిపై కొన్ని హామీలను మోడీ ప్రకటిస్తారని మూడు పార్టీల నాయకులు భావించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూశారు. అయితే ఈ అంశాల జోలికే వెళ్లకపోవడంతో కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకు మోడీ పర్యటన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
కీలక అంశాత ప్రస్తావన
అన్ని రాష్ట్రాలతో పాటు రాష్ట్రానికి ఇస్తున్న జలజీవన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను గురించి మాట్లాడటం తప్ప పదేళ్ల నుంచి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేకపోయారు. పసలేని మోడీ ప్రసంగాన్ని ప్రజలు, తమ పార్టీ కార్యకర్తలు మార్చిపోవడానికి చాలా సమయం పట్టిందని టిడిపి అంటున్నారు.
ఇప్పుడు పోలింగ్‌కు ఐదు రోజుల ముందు మోడీ పర్యటన ఖరారు కావడంతో వారిలో ఆందోళన నెలకొంది. రాష్ట్రవిభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, రాజధాని అమరావతి అంశాలపై ఈ సారైనా స్పష్టమైన హామీ ఇవ్వకపోతే తమకు నష్టం కలుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేతల్లో ఉత్కంఠ
ఇప్పటికే బిజెపితో పొత్తు వల్ల తమకు మైనార్టీలు దూరమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో తమకు సహకారం ఉంటుందనే ఆశతో బిజెపితో పొత్తు పెట్టుకున్నామని అంటున్నారు. ఇదే సమయంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు గురించి ప్రస్తావన టీడీపీకి టెన్షన్ పెంచుతోంది.
ఇక..ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టం కావటంతో ఈ అంశం ప్రస్తావన చేసినా నష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమిత్ షా తాజాగా ధర్మవరం పర్యటనలో జగన్ పైన విమర్శలు చేసారు. ప్రధాని సైతం అదే విధంగా స్పందిస్తే తమకు ప్రయోజనం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో, ప్రధాని మోదీ పర్యటనలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications