Palamaner Assembly: వైసీపీ హ్యాట్రిక్ ను అమర్నాథ్ రెడ్డి అడ్డుకోగలరా?
చిత్తూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న జనరల్ అసెంబ్లీ సీటు పలమనేరు నియోజకవర్గం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఎస్సీ రిజర్వుడుగా ఉండేది. ఆ తర్వాత జనరల్ గా మారింది. ఇందులో పలమనేరు , గంగవరం , బైరెడ్డిపల్లె , వెంకట గిరి కోట , పెద్ద పంజాణి మండలాలు ఉంటాయి . ఓటర్ల సంఖ్య 2.6 లక్షలు. జనాభాపరంగా చూస్తే ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఆ తర్వాత దాదాపు సమానంగా రెడ్లు ఉంటారు . ఆ రెండు కులాల తర్వాత మాల , వడ్డెర కులాలు ఉన్నాయి . రాజకీయంగా రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
టీడీపీ ఆవిర్భావానికి ముందు పలమనేరులో జరిగిన నాలుగు ఎన్నికల్లో మూడుసార్లు కాంగ్రెస్, 1967లో స్వతంత్ర పార్టీ గెలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరగగా.. 1999లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ మాత్రం ఆరుసార్లు (1983, 1985, 1989, 1994, 2004, 2009లో) గెలిచింది. ఆ తర్వాత వైసీపీ 2014, 2019 ఎన్నికల్లో గెలిచింది.టీడీపీ నుంచి మూడుసార్లు గెలిచిన పట్నం సుబ్బయ్య మంత్రిగా కూడా పనిచేశారు.

2009లో టీడీపీ నుంచి గెలిచిన అమర్ నాథ్ రెడ్డి.. 2014లో వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయి తిరిగి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. 2019లో మాత్రం టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉండే పలమనేరు సీటులో 2019 ఎన్నికల్లో వైసీపీ లింగాయత్ అభ్యర్ధి వెంకటే గౌడను నిలబెట్టి జగన్ హవాలో గెలిపించుకుంది.
గతంలో కేవలం 3 వేల ఓట్ల మెజార్టీతో 2014లో గెలిచిన అమర్నాథ్ రెడ్డి.. 2019లో మాత్రం ఏకంగా 32 వేల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లోనూ వెంకటే గౌడకూ, అమర్నాథ్ రెడ్డికే పోటీ ఉండబోతోంది. అయితే సంప్రదాయ టీడీపీ ఓట్లతో పాటు అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి స్ధానికంగా ఉన్న పట్టు టీడీపీకి ప్లస్ కానున్నాయి. వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలను నమ్ముకుని బరిలోకి దిగుతోంది.












Click it and Unblock the Notifications