జగన్ సర్కార్ కు సుప్రీంలో మరో సంకటం ? విభజనకు మద్దతిస్తారా ? వ్యతిరేకిస్తారా ?
ఏపీని ఏపీ-తెలంగాణగా విభజించి తొమ్మిదేళ్లయిపోతోంది. మరో ఏడాదిలో విభజన చట్టం అమలు గడువు కూడా ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ కూడా నత్తనడకన సాగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై మౌనంగా ఉంటూ వచ్చింది. కానీ తాజాగా సుప్రీంకోర్టు దీనిపై విచారణ తిరిగి ప్రారంభించడంతో జగన్ సర్కార్ తన అభిప్రాయం చెప్పాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

సుప్రీంకోర్టులో ఏపీ విభజనపై విచారణ
ఏపీ విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిపై మెజార్టీ ప్రజానీకానికి ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు. కానీ విభజన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్, రఘురామకృష్ణంరాజు, జయప్రకాష్ నారాయణతో పాటు దాదాపు 32 మంది సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేశారు. అయితే అప్పటికే విభజన పూర్తి కావడం, మెజార్టీ అభిప్రాయం విభజనకు అనుకూలంగా ఉండటంతో సుప్రీంకోర్టు కూడా దీన్ని లైట్ తీసుకుంది. కానీ న్యాయప్రక్రియలో తొమ్మిదేళ్లుగా పెండింగ్ లో ఉన్న పిటిషన్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితుల్లో సుప్రీంకోర్టు తిరిగి విచారణ ప్రారంభించింది. దీంతో ఈ విచారణ పూర్తయి వెలువడే తీర్పు కీలకంగా మారుతోంది.

సానుకూలంగా తెలంగాణ
ఏపీ విభజన చట్టం అమలులో ఇప్పటికే కేంద్రం అలసత్వం కారణంగా నష్టపోతున్న ఇరు రాష్ట్రాలు ఇప్పుడు సుప్రీంకోర్టులో తమ అభిప్రాయాలు చెప్పాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అయితే తెలంగాణ కోరుకున్న బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో సుప్రీంకోర్టులో తెలంగాణ అభిప్రాయం విభజన చట్టానికి సానుకూలంగానే ఉంది. కానీ ఏపీ పరిస్ధితి వేరు. విభజనపై ఇప్పుడు జగన్ సర్కార్ తన అభిప్రాయం చెప్పడం అంత సులువు కాదు. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో ఏం చెబితే ఏం జరుగుతుందన్న భయాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. దీంతో ఇప్పటివరకూ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదు.

జగన్ సర్కార్ కు సంకటం ?
ఏపీ విభజన సమయంలో దాన్ని సమర్ధించాలా వద్దా అనే విషయంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ రెండు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే తెలంగాణలో పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో విభజనకు అనుకూలంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చారు. కానీ జగన్ మాత్రం తెలంగాణను వదులుకుని తనది సమైక్య వాదమని తేల్చిచెప్పేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు అదే విషయం చెప్పాల్సిన పరిస్ధితి వైసీపీది. అలాగని విభజనను సమర్ధించలేరు, వ్యతిరేకించలేదు. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ ఈ నెల 22న సుప్రీంకోర్టుకు ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది. ఇప్పటికే ఏపీ సర్కార్ అభిప్రాయం కోరిన ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి.. విభజనను సమర్ధిస్తున్నామని, కానీ మళ్లీ కలిసే అవకాశం ఉంటే సమర్ధిస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ సుప్రీంకోర్టులో అలా కుదరదు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications