రాగల 48 గంటల్లో... వాతావరణశాఖ అంచనా
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు జోరందుకున్నాయి. రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి బలహీనపడింది. ఈ ప్రభావం వల్ల రాష్ట్రమంతా మూడురోజులు వర్షాలు కురవనున్నాయి.
యానాం, ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం నుంచి తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్లు, పాతపట్నంలో 3.1, పలాసలో 3, మందసలో 2.8, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 2.5, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 2, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిశాయి. మరోవైపు తెలంగాణలో కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్, రంగారెడ్డి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.












Click it and Unblock the Notifications