మహిళ గొంతు కోసి దారుణంగా హత్య
కర్నూలు: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గ్రామంలో చంద్రశేఖర్‌రెడ్డి భార్య శింగనపల్లె వరలక్ష్మీదేవి(46) గురువారం దారుణ హత్యకు గురైంది. దోపిడీ యత్నంలో భాగంగా దుండగులు ఆమె గొంతు కోసి ఈ దారుణానికి పాల్పడి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బెలుం గ్రామ శివార్లలో చంద్రశేఖర్‌రెడ్డి నివసిస్తున్నారు.
ఆయన పని నిమిత్తం నంద్యాలకు ఉదయం వెళ్లగా కుమారుడు రాజేశ్వరరెడ్డి పొలానికి వెళ్లాడు. ఇంటి వద్ద వరలక్ష్మీదేవి ఒక్కతే ఉండటంతో ఇదే అదునుగా గుర్తుతెలియని దుండగులు ఇంట్లో ప్రవేశించారు. టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి దోపిడీకి పాల్పడ్డారు. వంటరూములో ఉన్న బీరువా తలుపులు తెరిచేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకోబోయిన వరలక్ష్మీదేవిని కత్తి పీటతో గొంతు కోసి హత్య చేశారు.

అనంతరం ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసుతో పారిపోయారు. అయితే బీరువాలో ఉన్న రూ.3 లక్షల నగదు, బంగారు నగలు మాత్రం పదిలంగానే ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో పొలం నుంచి ఇంటికి వచ్చిన కొడుకు రాజేశ్వరరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి కేకలు వేశాడు. దీంతో గామస్థులు సంఘటనా స్థలానికి చేరారు.
ఆళ్లగడ్డ డీఎస్‌పీ రామాంజనేయరెడ్డి, కోవెలకుంట్ల సీఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐ నీలకంఠేశ్వర్ పరిశీలించారు. సాయంత్రం కర్నూలు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. క్లూస్ టీం బీరువాపై ఉన్న వేలి ముద్రలు సేకరించింది. డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలం నుంచి గ్రామంలోని బావి వద్దకు, చర్చి, ప్రాథమిక పాఠశాల వరకు, అక్కడ నుంచి తిరిగి సంఘటనా స్థలానికే చేరుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications