Women's Day: ఒకేరోజు 12 దిశ పోలీస్ స్టేషన్లు..కొత్తగా కోర్టులు: మహిళలకు జగన్ సర్కార్ గిఫ్ట్‌గా.. !
అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం 12 దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించనుంది. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా మరో 12 పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ప్రారంభించబోతోంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దీనితో పాటు- అత్యాచార కేసులను విచారించడానికి ప్రత్యేకంగా న్యాయస్థానాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రకియను ప్రారంభించబోతోంది.
ఏపీ దిశ చట్టంలో భాగంగా- రాష్ట్ర ప్రభుత్వం వాటిని నెలకొల్పబోతోంది. మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులకు 21 రోజుల్లోనే ఉరికంబాన్ని ఎక్కించడంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ దిశ చట్టానికి రూపకల్పన చేశారు. ఇందులో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో ఆరు పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.

తాజాగా- మరో 12 పోలీస్ స్టేషన్లు ఆదివారం నుంచి కార్యకలాపాలను ఆరంభించబోతున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక న్యాయస్థానాలను నెలకొల్పడానికి అవసరమైన ప్రక్రియను కూడా చేపట్టబోతోంది. అత్యాచార కేసులను సత్వరంగా పరిష్కరించడానికి, నిందితులను గుర్తించడానికి అవసరమైన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలను నెలకొల్పడానికి ఈ నెలాఖరులోగా చర్యలు చేపట్టవచ్చని అంటున్నారు.
విశాఖపట్నం, తిరుపతిల్లో దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తోన్న అన్ని మహిళా పోలీస్ స్టేషన్లను దిశ పోలీస్ స్టేషన్లుగా మార్చబోతోంది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications