వెన్నుపోటు, కుట్రలు మానుకోండి: వైసీపీ, బీజేపీలపై యనమల, కొనకళ్ల, బుగ్గనది పెద్దనేరమే
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ నేతలను కలవడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. శాసనసభ కమిటీలన్నీ రాజ్యాంగబద్ధమని, శాసనసభ కమిటీల రిపోర్టులను రహస్యంగా ఉంచాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం, పట్టిసీమ, అమరావతి నిర్మాణానికి భూసేకరణలాంటి పలు అంశాల్లో అవినీతి జరిగిందంటూ తయారుచేసిన పేపర్లను అందించినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి యనమల మీడియాతో మాట్లాడారు.

పెద్ద నేరమే
శాసనసభ ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధం కాదా..? ప్రశ్నించారు. ఇదే నిజమైతే బుగ్గనపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు పెట్టకూడదని మంత్రి యనమల అన్నారు. ప్రలోభాలతో ప్రశ్నలు అడిగిన ఉదంతం కన్నా ఇది పెద్ద నేరమని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిర్ధారించాల్సి ఉందని మంత్రి యనమల పేర్కొన్నారు.

బీజేపీతో వైసీపీకేం పని?
టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నేతలు బీజేపీ పెద్దలతో ఢిల్లీలో కలుస్తున్నారని అన్నారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీకి పనేంటి? అని కొనకళ్ల ప్రవ్నించారు.

వెన్నుపోటు పొడవద్దు
ఏపీకి అన్ని రకాలుగా న్యాయం చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు మోసం చేసిందన్నారు. వెనుకబడిన జిల్లాల కోసం రూ.300కోట్లు ఇచ్చి మళ్లీ వెనక్కి ఎందుకు తీసుకున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని, హోదాతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ కోసం చేసే పోరాటంలో వైసీపీ కూడా కలిసి రావాలన్నారు. తాము చేసే పోరాటానికి అడ్డుతగలవద్దని, వెన్నుపోటు పొడవ వద్దని, ఉద్యమాన్ని నీరుగార్చవద్దని కొనకళ్ల కోరారు.

రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య యుద్ధం
బీజేపీ, వైసీపీలు కుమ్మక్కు రాజకీయాలు మానుకోవాలని కొనకళ్ళ నారాయణ హితవు పలికారు. కడప, విశాఖ, అనంతపురం, అమరావతిలో నిరసనలు వ్యక్తం చేస్తూ బహిరంగ సభలు పెడతామని అన్నారు. అందరూ పార్లమెంటు సభ్యులు వస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కలిసి రావాలని, అందరితో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కొనకళ్ల అన్నారు. మరో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య యుద్ధం జరుగుతోందని, అన్ని పార్టీలు తమకు మద్దతివ్వాలని అన్నారు.












Click it and Unblock the Notifications