పోటీ పై తేల్చేసిన యార్లగడ్డ, ఆ మంత్రులే కారణం - జగన్ ఏం చెప్పారు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. గన్నవరంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఈ సమయంలో యార్లగడ్డ వెంకటరావు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. తాను వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తానని స్పష్టం చేసారు. సీటు ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్ ను ప్రజలే నిర్ణయిస్తారని పరోక్షంగా తన రూట్ స్పష్టం చేసారు.
తేల్చేసిన యార్లగడ్డ: గన్నవరం రాజకీయంగా మరో సారి ఆసక్తి కరంగా మారుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకటరావు కార్యకర్తలతో సమావేశమయ్యారు. వంశీ వైసీపీలోకి వచ్చిన సమయం నుంచి రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు వ్యతిరేకంగా ఉన్నారు. వంశీతో కలిసి పని చేసేది లేదని తేల్చి చెబుతున్నారు.

ఇక, యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం నడుమ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమా వేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ అధికారంలో ఉన్నా తన పైన 19 కేసులు..దుట్టా రామచంద్రరావుపై 11 కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల మీద కేసులు మాఫీ జరిగినా ఒక్క గన్నవరంలో మాత్రమే అసలైన వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు ఎత్తివేయలేదని వివరించారు.
వంశీపైన కీలక వ్యాఖ్యలు: 2019 ఎన్నికల్లో అప్పటి ప్రత్యర్థి దొంగ ఇళ్ల పట్టాలు, రిగ్గింగ్ కారణంగా స్వల్ప ఓట్లతోనే నేను ఓడానంటూ పరోక్షంగా వంశీ పైన వ్యాఖ్యలు చేసారు. ఇద్దరు మంత్రులు చేసిన పని వల్ల ఈ రోజున గన్నవరంలో టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారని చెప్పుకొచ్చారు. తన ఇంటికి వచ్చి సన్మానం చేస్తానన్న వ్యక్తికి, నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండగా.. జగన్ సభకు కళ్యాణమండపం కూడా ఇవ్వనీయని వ్యక్తికి, జగన్‌ను, భారతిని తిట్టిన వ్యక్తికి ఇన్‌చార్జి అప్పగిం చారని కీలక వ్యాఖ్యలు చేసారు.
దీనిపై అడిగినపుడు టీడీపీకి ప్రతిపక్ష హోదా తీసే యటం కోసమే అన్నారని వివరించారు. వంశీతో కలిసి పనిచేయమంటే.. నేను కలవలేనని చెప్పానని వెల్లడించారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా గన్నవరం ప్రజలతోనే ఉంటా నని చెప్పానని యార్లగడ్డ వివరించారు.

సీఎం జగన్ హామీ ఇచ్చారు: వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కొత్త నాయకుడి నిరాదరణకు గురౌతున్నారని తానును జగన్ దృష్టికి తీసుకువెళ్లానని వెంకటరావు చెప్పారు. వారిని మంత్రులు చూసుకుంటారని చెప్పారని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను కూడా ఇప్పించుకోలేని దుస్థితి నెలకొందన్నారు. తన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటానని జగన్ చెప్పారని వివరించారు.
ఈ రోజు తాను క్రాస్ రోడ్డులో ఉన్నానని... రాజకీయాల్లో తానెవరికీ భయపడనన్నారు. అన్నా గన్నవరం సీటు నాకు ఇవ్వు అని యార్లగడ్డ జగన్‌కు సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా గన్నవరం సీటును పార్టీ అధిష్టానం తనకే ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. దీంతో, ఇప్పుడు గన్నవరం లో వైసీపీ అధినాయకత్వం నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications