నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ - ఒక్క సీటు దక్కని టీడీపీ : మంత్రి అనిల్ ఖాతాలో..!!
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీకి ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక పోయింది. కుప్పంలో కుప్పకూలిన టీడీపీ..ఇక్కడ అడ్రస్ లేకుండా పోయింది. నెల్లూరు కార్పోరేషన్ లో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే అక్కడ 8 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆ స్థానాలు మొత్తం వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. కార్పొరేషన్ ఎన్నిక జరిగిన 46 డివిజన్లలో 46 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి 54 డివిజన్లను కైవసం చేసుకొన్న వైఎస్సార్‌సీపీ కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఏకపక్షంగా వైసీపీ విజయం
ఇతర పార్టీ సభ్యులెవరూ ఫలితాల్లో పోటీ పడలేక పోయారు. ఇక్కడ టీడీపీ..సీపీఎం అదే విధంగా బీజేపీ - జనసేన మద్య పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగారు. తాము పోటీ చేసే స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో అనేక సీట్లలో నామినేషన్లు దాఖలు చేసారు. ఆ తరువాత బుజ్జిగింపులతో సర్దుబాటు జరిగింది. ఇక, వైసీపీ లో మంత్రి అనిల్ నగర ఎమ్మెల్యేగా ఎన్నికల పైన పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ జిల్లా సమన్వయకర్తగా ఉన్న ప్రధాన కార్యదర్శి సజ్జల నెల్లూరు లో గెలుపు పైన నేతలకు దిశా నిర్దేశం చేసారు. నేతలకు బాధ్యతలు అప్పగించారు.

ఒక్క సీటు దక్కించుకోలేని ప్రతిపక్షాలు
అయితే, ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ధీమాతో కనిపించిన టీడీపీ.. జనసేన..బీజేపీ ఎక్కడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. విశాఖ...కాకినాడల్లోనూ ఇదే తరహాలో ఫలితాలు వచ్చాయి. ఇక, దాచేపల్లిలో మాత్రమే జనసేన ఒక్క సీటు గెలుచుకుంది. కాగా, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ 19 స్థానాలు సాధించి మున్సిపాల్టీని దక్కించుకుంది. మొత్తం 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే అందులో ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ విజయం సాధించింది. క్రిష్ణా జిల్లా కొండపల్లి నగర పంచాయితీలో టై పరిస్థితి కనిపిస్తోంది.

నెల్లూరులో 54 వార్డులు వైసీపీ వైపే
అక్కడ స్వతంత్ర అభ్యర్ధి కీలకంగా మారారు. అదే విధంగా టీడీపీకి పట్టున్న పెనుకొండలోనూ టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. మొత్తం 12 మున్సిపాల్టీల్లో వైసీపీ పది చోట్ల గెలిచింది. ఇక, దర్శిలో టీడీపీ గెలిచినా..అక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు పది సీట్లు..ఎంపీ సీటు వైసీపీ గెలుచుకుంది. ఇక, ఇప్పడు నెల్లూరు వైసీపీలో ఉన్న అధిపత్య పోరు ఖచ్చితంగా ఎన్నికల పైన ప్రభావం పడుతుందని టీడీపీ నేతలు అంచనా వేసారు. కానీ, ఏకపక్షంగా ప్రతిపక్షాలకు ఒక్క వార్డు కూడా ఇవ్వకుంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.












Click it and Unblock the Notifications