జూ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు - బాలకృష్ణపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. నందమూరి కుటుంబంలో బాలయ్య వర్సస్ జూఎన్టీఆర్ వివాదం ముదురుతోంది. కొంత కాలంగా టీడీపీ, జూ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ వర్దంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరోసారి బాలయ్య అక్కడ జూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలిగించాలని ఆదేశించటం మరో వివాదానికి కారణమైంది. ఈ వివాదంపైన మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేసారు.
బాలయ్య Vs తారక్
ఎన్టీఆర్ ఘాట్ వద్ద అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు వేకువజామున నివాళి అర్పించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ జూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసిన ఆయన వెంటనే వాటిని తొలిగించాలని ఆదేశించారు. దీంతో, జూ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న జూ ఎన్టీఆర్ పైన గతంలోనూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి.

ఫ్లెక్సీల తొలిగింపుతో
ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వివాదం పైన మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేసారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే తారక్ కు ఏమైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ ఆదేశాలతోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అభిమానులు తొలగించారన్నారు. ప్లెక్సీలను తొలగిస్తే ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబును ఎవరూ పట్టించుకోరన్నారు.
లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను నాశనం చేస్తున్నారు - కొడాలి నాని#KodaliNani #JrNTR #NaraLokesh #Oneindiatelugu pic.twitter.com/WQqQ1yClSC
— oneindiatelugu (@oneindiatelugu) January 18, 2024
జూ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు
కొడుకును సీఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అంటూ మండిపడ్డారు. తండ్రిని పదవి నుంచి దింపిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైన పడ్డారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. వాళ్లది నీచాతి నీచమైన బుద్ది అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అని నిలదీసారు. కొడుకును సీఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అన్నారు. ఎన్టీఆర్ వర్దంతి నాడు నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి తెర మీదకు రావటంతో దీని పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications