వివేకా హత్య కేసు - నిరూపిస్తే 9 మంది ఎమ్మెల్యేల రాజీనామా : సీబీఐకి రాచమల్లు సవాల్..!!
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం పైన ఇప్పుడు రాజకీయంగా భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అందులో ఎంపీ అవినాశ్ గురించి ప్రస్తావించటం ..ఎర్రగంగిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు కడప జిల్లా వైసీపీ నేతలు వరుసగా రియాక్ట్ అవుతున్నారు. అవినాశ్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇక, ఇప్పుడు తాజాగా కడప జిల్లా కు చెందిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వివేకానందరెడ్డి హత్య కుట్రలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.

9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా కు సిద్దం
ఒకవేళ ఉందని నిరూపిస్తే నాతో కలిపి జిల్లాలోని మరో 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ చేసారు. డబ్బు, అవమానం, వ్యక్తిగత బలహీనతలే వివేకా హత్యకు ప్రధాన కారణాలుగా ఆయన పేర్కొన్నారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమామహేశ్వర్‌రెడ్డి, దస్తగిరిలే హత్యకు కారకులన్నారు. మొదట పోలీసులు, సిట్, సీబీఐల దర్యాప్తులో భాగంగా ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి ఇచ్చిన 161 స్టేట్‌మెంట్‌లో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిల పేర్లు లేవని చెప్పుకొచ్చారు.

దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు
తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో మేజిస్ట్రేట్ ముందు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం 164 స్టేట్‌మెంట్‌లో ఎర్రగంగిరెడ్డి ఆయనకు చెప్పినట్లు ఆ నలుగురి పేర్లు చెప్పారని... ఈ రెండు స్టేట్‌మెంట్లకు పొంతన లేదని రాచమల్లు విశ్లేషించారు. హత్యలో పాల్గొన్నానని డ్రైవరు దస్తగిరి వాంగ్మూలం ఇస్తే ఈ రోజు వరకు అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని సీబీఐని ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. అతన్ని అప్రూవర్‌గా మార్చడంలో భాగంగానే హైకోర్టులో పిటిషన్ వేశారని చెబుతూ... ముద్దాయిని సాక్షిగా మార్చేందుకు హైకోర్టును సీబీఐ అనుమతి కోరడం సబబు కాదని వ్యాఖ్యానించారు.

కోర్టులో కౌంటర్ దాఖలు
ఇదే సమయంలో వివేకా హత్య కేసులో దస్తగిరి తరఫున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్‌పై న్యాయవాదులు బుధవారం కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని... అతని సాక్ష్యం నమోదు చేయాలని అక్టోబరు 22న సీబీఐ కడప సబ్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు పంపింది. దాంతో కౌంటర్ దాఖలుకు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం పత్రాలను ఇవ్వాలని ఈ ముగ్గురి తరఫు న్యాయవాదులు కోరారు.
Recommended Video

సీబీఐ అడుగుల పై ఉత్కంఠ
కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈనెల 13న వాటిని అందజేసింది. మరో వైపు వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై కడప సబ్ కోర్టులో విచారణ ఈనెల 19కు వాయిదా పడింది. ఇక, ఇప్పుడు సీబీఐ వేయబోయే తదుపరి అడుగుల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications