పవన్ సత్తా కు సవాల్, జగన్ కొత్త గేమ్ - సీన్ మర్చేస్తారా..!!
ఏపీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పవన్ కల్యాణ్ ఈ సారి పోటీ ఎక్కడ. 2014 పొత్తులు రిపీట్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుండటంతో జగన్ ఏం చేయబోతున్నారు. ఇలా..ప్రతీ అంశం ఎన్నికల వేళ ఆసక్తిని పెంచుతోంది. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సారి పవన్ పోటీ నియోజకవర్గం ఇంకా ప్రకటించలేదు. వైసీపీ మాత్రం పవన్ పోటీ చేసే స్థానాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
పిఠాపురంలో కొత్త లెక్కలు:
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నుంచి వైసీపీ అభ్యర్దుల చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలు అడుగు పెట్టాలనేది పవన్ లక్ష్యం. ఇందు కోసం పలు నియోజక వర్గాల్లో సర్వేలు చేయించారు. భీమవరం నుంచి పోటీ చేస్తారని భావించినా...అక్కడ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పేరు ఖరారైనట్లు సమాచారం.

దీంతో, పిఠాపురం వైపు పవన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కాపు సామాజిక వర్గం ఓటింగ్ బలంగా ఉండటంతో ఖచ్చితంగా గెలుపు దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. తూర్పు గోదావరిలో పోటీ చేయటం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని జనసేనాని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం కీలకంగా మారనుంది.
పవన్ పోటీ చేస్తారా:
వైసీపీ నుంచి ప్రస్తుత ఎంపీ వంగా గీత పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. తాజాగా ముద్రగడ వైసీపీలో వస్తున్నారనే చర్చల వేళ గీతను మార్చి ముద్రగడను పోటీకి దించుతారని భావించారు. కానీ, ముద్రగడ వైసీపీలో చేరినా ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. పిఠాపురం సామాజిక సమీకరణాలతో వైసీపీ కొత్త లెక్కలతో సిద్దం అవుతోంది.
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే టీడీపీకి వ్యతిరేకించే వారెవరో గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. పవన్ ఎక్కడ పోటీ చేసినా అక్కడ ముద్రగడను ప్రచారానికి పంపాలని భావిస్తోంది. వంగా గీత 2009లో ప్రజారాజ్యం నుంచి ఇక్కడే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ గీతకు కాపు వర్గం లోనే మద్దతు దారుల సంఖ్య గణనీయంగా ఉంది. పార్టీ ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

వైసీపీ కొత్త ప్లాన్:
ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరితే పిఠాపురం లో లెక్కలు మారుతాయని భావిస్తున్నారు. ఇక్కడ 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్దిగా పోటీ చేసిన విశ్వంకు 15,187 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన దొరబాబుకు 50,431 ఓట్లుగా రాగా, స్వతంత్ర అభ్యర్దిగా బరిలో నిలిచిన వర్మకు 97,511 ఓట్లు రావటంతో..కూటమి, వైసీపీ పైన 47,080 ఓట్లతో గెలిచారు.
ప్రస్తుతం టీడీపీ నుంచి వర్మ ఈ సీటు ఆశిస్తున్నారు. ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత ముద్రగడతో వైసీపీ మంత్రాంగం ప్రారంభించింది. అయితే, పవన్ ఇప్పటి వరకు పిఠాపురం నుంచి పోటీ పైన ప్రకటన చేయలేదు. తిరుపతి స్థానం సైతం పరిశీలనలో ఉందని చెబుతున్నారు. గాజువాక, తాడేపల్లిగూడెం పైన చర్చ జరుగుతోంది. దీంతో, పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఫలితం ఏంటనే చర్చ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications