వైసిపి ఆధ్వర్యంలో విశాఖలో నేడు వంచన వ్యతిరేక దీక్ష...పోటాపోటీ దీక్షలు
విశాఖపట్నం: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలు, పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాభివృద్ది పై అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని బీజేపీ వంచన వైఖరికి నిరసనగా విశాఖపట్నంలో వైసిపి "వంచన వ్యతిరేక దీక్ష" చేపడుతోంది.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఈ వైసిపి దీక్షా వేదికను నిర్మించారు. ఈ దీక్షలో భాగంగా వైసిపి నేతలంతా నల్ల దుస్తులు ధరించి దీక్షలో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష రాత్రి 7 గంటల వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేసేది అధర్మ పోరాటమని, ప్రజలకు ద్రోహం చేస్తూ తిరిగి అధికారంలోకి వచ్చే లక్ష్యంతో చంద్రబాబు చేస్తున్న పోరాటం ధర్మపోరాటమెలా అవుతుందని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

ఈ నేపథ్యంలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైసిపి అధినేత జగన్ తమ పార్టీ చేపట్టిన వంచన వ్యతిరేక దీక్షకు మద్దతుగా నల్లదుస్తులు ధరించి పాదయాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానంటూ నరేంద్ర మోడీ మోసం చేశారంటూ టిడిపి తిరుపతి వేదికగా సోమవారం ధర్మదీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో తిరుమల వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చి వంచన చేసిన నరేంద్ర మోదీ, బీజేపీలపై తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ టిడిపి ఆ సభ నిర్వహిస్తోంది.

అయితే ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతోపాటు రాష్ట్ర ప్రజలు నాలుగేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోకపోగా అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన చంద్రబాబు ప్రజలను ఎలా వంచిస్తున్నదీ వివరించేందుకు ఈ వంచన వ్యతిరేక దీక్షను నిర్వహిస్తున్నట్లు ఈ దీక్షలో పాల్గొంటున్న వైసిపి నేతలు చెబుతున్నారు.
చంద్రబాబు దీక్షలకు పూనుకోవడం కేవలం మళ్లీ అధికారం కోసం వేస్తున్న ఎత్తుగడలే తప్ప మరొకటి కాదని రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తామని వైసిపి నేతలు తెలిపారు. ఈ దీక్షల్లో వైకాపా ముఖ్య నేతలు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, అంబటి రాంబాబు, భూమ కరణాకర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవ ర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!