అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయడం అంత అత్యవసరమా?: సుప్రీంకోర్టు సూటి ప్రశ్న
న్యూఢిల్లీ/కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవినాష్ రెడ్డి లభించిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి.
వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతరెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ఇది. ఈ ఉదయం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అమానుల్లాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ ఈ పిటీషన్‌పై వాదనలను ఆలకించింది. సునీత రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా తన వాదనలను వినిపించారు. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి జారీ చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వాదనల సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. వెకేషన్ బెంచ్ ముందుకొచ్చిన ఈ ముందస్తు బెయిల్‌ను ఇప్పటికిప్పుడు రద్దు చేయడం అంత అవసరమా? అంటూ జస్టిస్ విక్రమ్‌నాథ్ సూటిగా ప్రశ్నించారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమా అనేది దర్యాప్తు ఏజెన్సీకి సంబంధించిన విషయమని జస్టిస్ అమానుల్లా తేల్చి చెప్పారు. విచారణకు ఆయన సహకరిస్తున్నారని కూడా సీబీఐ నివేదించిందని గుర్తు చేశారు.
సునీతా రెడ్డి దాఖలు చేసిన ఈ పిటీషన్‌ను ఎందుకు కొట్టివేయకూడదని అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రాను ప్రశ్నించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాదిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తాము ఇప్పుడు ఈ పిటీషన్‌ను కొట్టి వేస్తే సీనియర్ అడ్వొకేట్‌కు ఇబ్బందులు వస్తాయని, అందుకే దీన్ని సెలవుల తరువాత లిస్ట్ చేస్తామని పేర్కొంది. దీనిపై లూథ్రా మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి కావాల్సి ఉందని అన్నారు.

కేసును విచారించడానికి ఒక బెంచ్ నిర్దేశించిన గడువును మరో బెంచ్ మార్చలేదని జస్టిస్ విక్రమ్ నాథ్ స్పష్టం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సునీత రెడ్డి జోక్యం చేసుకున్నారు. సీబీఐని బుధవారం నాటి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి బెంచ్ బదులిస్తూ- అది వారి ఇష్టమని, అందుకే జూలై 3వ తేదీన హాజరు కావాలని ఆదేశించినట్లు వివరించింది.
సునీత మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిష్ఫలంగా ఉన్నాయంటూ గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేయగా.. జస్టిస్ అమానుల్లా అడ్డుకున్నారు. నిందితుడు (వైఎస్ అవినాష్ రెడ్డి) మీ బంధువా?.. అంటూ సూటిగా ప్రశ్నించారు. దీనికి ఆమె అవునంటూ బదులిచ్చారు. ఆ సమయంలో లూథ్రా స్పందించారు. ఈ పిటీషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి బెంచ్ అంగీకరించలేదు. ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications