సుప్రీం ఆదేశాలూ బేఖాతర్- ఎస్ఈసీ ఏం చేస్తోంది? ఎన్నికల హింసపై జగన్ ఫైర్..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ దాడులు, వాటిని అడ్డుకోవడంలో ఎస్ఈసీ వైఫల్యాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మరోసారి తీవ్రంగా తప్పుబట్టారు. నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న హింసపై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనూ వీరు లెక్కచేయడం లేదని ఆరోపించారు. స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పినా ఇంకా అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారని విమర్శించారు.
డీజీపీ తోలుబొమ్మగా మారారని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని జగన్ సూటిగా ప్రశ్నించారు. అలాగే ప్రజలకు మంచి చేశామనే నమ్మకం ఉంటే నామినేషన్లను అడ్డుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా చంద్రబాబులో కానీ, డీజీపీలో కానీ, ఎస్ఈసీలో కానీ, డీఐజీలు, కలెక్టర్లలో మార్పు రాలేదన్నారు. 19 చోట్ల నామినేషన్లను అడ్డుకున్నారని తాము ఫిర్యాదు చేస్తే .. కేవలం నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్లను పొడిగించారన్నారు. ఎస్ఈసీ కూడా చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నారా లేక సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నారా అని ప్రశ్నించారు.

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు శకునిలా మారి రూల్స్ తానే సెట్ చేస్తున్నారని, దానికి బదులు మూడేళ్ల పాలనపై ప్రజల్ని ఓటు అడగాలని జగన్ సూచించారు. కోవిడ్ లో సైతం తాము 90 శాతం హామీలు అమలు చేసి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగామని, చంద్రబాబు మనిషి అయిన నిమ్మగడ్డ రమేశ్ అడ్డంకులు కల్పించినా వాటిని అధిగమించి, వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రస్తుతం సూపర్ సిక్స్, సూపర్ 7 లేవని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని జగన్ ఆరోపించారు. జంగిల్ రాజ్ బీహార్ లో కాదు ఏపీలో చూపిస్తున్నారని, 101 మండలాల్లో ఎంపీటీసీ స్ధానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదన్నారు. నామినేషన్ కేంద్రాల వద్దా అవే దాడులు చేస్తున్నారన్నారు. మరో 70 మండల్లాల్లో ఐదు కంటే తక్కువ నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న అధికారుల్ని తప్పించకుంటా ఎన్నికలు నిష్పాక్షికంగా ఎలా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై దాడులు, నామినేషన్ పత్రాలు చించేయడం, నామినేషన్ కేంద్రాల్లో దూరి అడ్డుకోవడం వంటి ఘటనలకు సంబంధించిన ఆధారాల వీడియోల్ని జగన్ ప్రదర్శించారు. ఇంత జరుగుతున్నా ఎస్ఈసీ చర్యలు తీసుకోకపోవడం ఏంటని జగన్ నిలదీశారు.












Click it and Unblock the Notifications
