కివీస్ తో రెండో టీ20కి స్టార్ బ్యాట్స్ మెన్ అవుట్..! వైభవ్ కు ఛాన్స్..!
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ నెగ్గి ఊపుమీదున్న టీమిండియాకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. తొలి టీ20లో భారత జట్టు ఉత్కంఠ భరిత విజయం సాధించినా.. ఈ మ్యాచ్ లో విఫలమైన టీమిండియా స్టార్ లెప్ట్ హ్యాండర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) రెండో మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ వెల్లడించారు. అతని స్ధానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
క్రైస్ట్ చర్చ్ లో న్యూజీలాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఇషాన్ కిషన్ గజ్జల్లో గాయం అయిందని కోచ్ తెలిపారు. దీంతో హ్యాగ్లీ ఓవల్ లో జరిగే రెండో మ్యాచ్ లో అతను ఆడే అవకాశాలు దాదాపు లేవని వెల్లడించారు. దీంతో అతని స్ధానంలో వైభవ్ సూర్యవంశీని బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు కోచ్ పేర్కొన్నారు. వాస్తవానికి వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి రావడానికి మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంటుందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పిన రెండు రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది.

మరోవైపు టీ20ల్లో సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగే ఇషాన్ కిషన్‌ను.. నిన్న జరిగిన మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్ లో పంపడం అభిమానుల విమర్శలకు తావిచ్చింది. దీంతో ఇదో ప్రయోగమా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ మధ్య లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగుతున్న తిలక్ వర్మ.. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు రావడమే. అయినా మూడు బంతులే ఎదుర్కొని అవుటయ్యాడు. దీనిపై స్పష్టత ఇస్తూ కోచ్ సీతాన్షు కొటక్.. గజ్జల్లో స్వల్ప గాయం కారణంగానే ఇషాన్ కిషన్‌ను బ్యాటింగ్ క్రమంలో వెనక్కి పంపాల్సి వచ్చిందని తెలిపారు. ఇషాన్ కిషన్‌కు గజ్జల్లో స్వల్ప గాయం ఉందని, అందుకే తిలక్ వర్మను ముందుగా పంపడం జరిగిందని ఆయన వెల్లడించారు. రెండో టీ20లో కూడా ఇషాన్ ఆడే అవకాశం తక్కువని తేల్చేశారు. డాక్టర్ల సూచన మేరకు అతను పూర్తిగా కోలుకోకపోతే, అతని స్థానంలో వైభవ్ ఖచ్చితంగా జట్టులోకి రావచ్చన్నారు. అతను బలమైన పోటీదారులలో ఒకడని కూడా కోచ్ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కివీస్ తో రెండో టీ20లో ఇషాన్ కు రెస్ట్, వైభవ్ కు ఛాన్స్ ఖాయమని తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
