T20 world cup లో దక్షిణాఫ్రికాకు భారీ షాక్-ఫైనల్లో న్యూజీలాండ్..!
టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) సెమీస్ లో పెను సంచలనం. వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచ్ ల్లోనూ వరుసగా గెలిచి టైటిల్ ఫేవరెట్ రేసులో ఉన్న దక్షిణాఫ్రికాకు కివీస్ భారీ షాకిచ్చింది. ఇవాళ జరిగిన తొలి సెమీ ఫైనల్లో అజేయ దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా .. కివీస్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. చివర్లో మార్కో యాన్సన్ అర్ధసెంచరీతో ఆదుకోవడంతో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. దీన్ని న్యూజీలాండ్ అలవోకగా ఛేదించి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.
ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజీలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 12 పరుగుల వద్దే ఓపెనర్ డీకాక్, వన్ డౌన్ లో వచ్చిన రయాన్ రికెల్టన్ వికెట్లను కోల్పోయింది. కాసేపటికే మరో ఓపెనర్ మార్ క్రమ్ కూడా వెనుదిరగడంతో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డేవాల్డ్ బ్రేవిస్, స్టబ్స్ ఆదుకునే ప్రయత్నం చేసినా కివీస్ బౌలర్ల ధాటికి తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. చివర్లో ఆల్ రౌండర్ మార్కో యాన్సన్ మెరుపు అర్ధసెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.

అనంతరం 170 పరుగుల సునాయాస లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ కు ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. దక్షిణాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడుతూ వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. 58 పరుగులు చేశాక సీఫెర్ట్ అవుటైనా .... వన్ డౌన్ బ్యాట్స్ మెన్ రచిన్ రవీంద్ర సాయంతో ఫిన్ అలెన్ దూకుడు కొనసాగించాడు. ఇదే క్రమంలో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో న్యూజీలాండ్ మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.












Click it and Unblock the Notifications