ప్రకృతి ప్రేమికులకు విజువల్ ఫీస్ట్ గా 'సప్తగుండాల జలపాతం'.. ఎలా చేరుకోవాలి..?
తెలంగాణలో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రకంగా వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అనేక మంది రాజులు పరిపాలించారు. ఏళ్లుగా పలు రకాలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. కోటలు, కట్టడాలతో పాటు అందమైన అడవులు, జలపాతాలు, కొండలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలోని జలపాతాలు చూస్తే బొగత జలపాతం, కుంతల జలపాతం, పొచ్చెర జలపాతం, గాయత్రి జలపాతం, గుండాల జలపాతం, కనకాయి జలపాతం.. ఇవే గుర్తుకువస్తాయి.
అయితే తెలంగాణలో ఫేమస్ అయిన గుండాల జలపాతం అందాలు ప్రకృతి ప్రేమికుల్ని మైమరిపింపజేస్తున్నాయి. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఈ సప్త గుండాల జలపాతాన్ని మిట్ట జలపాతం అని కూడా పిలుస్తుంటారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ జలపాతం ఉప్పొంగుతోంది. పచ్చని అడవుల మధ్య దాగిన ఈ జలపాతం అందాలు చెప్పాలంటే మాటలు చాలవు. సప్తగుండాల జలపాతం అందాలను తిలకించేందుకు స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పర్యటకులు పోటెత్తుతున్నారు.

ఈ జలపాతం విశేషం ఏంటంటే..? ఇక్కడ ఏడు జలపాతాలు కలిసి కొండ మీది నుంచి జాలువారుతుంటాయి. వీటి పేర్లు రామగుండం, లక్ష్మిగుండం, సీతగుండం, లక్ష్మణ గుండం, భీమగుండం, సవితిగుండం, చిరుతలగుండం, సప్తగుండం జలపాతాలు కలిసి ప్రవహిస్తుంటాయి. ఎత్తయిన కొండల నుంచి ఈ జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది. ఈ జలపాతానికి ఎలా చేరుకోవాలంటే..? ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో ఈ జలపాతం ఉంది. లింగాపూర్ మండలంలోని పిట్టగూడ నుంచి 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే ఈ జలపాతానికి చేరుకోవచ్చు. ఈ జలపాతం హైదరాబాద్ నుంచి 252 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఉట్నూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.












Click it and Unblock the Notifications