ysrcp: ఇడుపులపాయలో పలకరించుకోని జగన్, షర్మిల
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో ఆయన ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తన సతీమణి భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తండ్రికి నివాళులర్పించే ముందుకానీ, ఆ తర్వాత కానీ జగన్, షర్మిల ఒకరినొకరు పలకరించుకోలేదు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఘాట్ నుంచి ఎవరికి వారుగా వెళ్లిపోయారు.
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఎటువంటి విభేదాలు లేవని వైసీపీ వర్గాలు ఎప్పటినుంచో ప్రకటిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మాత్రం ఇద్దరి మధ్యా కాస్తంత దూరం ఉందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తన తండ్రి జయంతి రోజు కలిసి కూడా ఇద్దరూ మాట్లాడుకోకపోవడం పార్టీ శ్రేణులకు విస్మయాన్ని కలిగించింది.

తెలంగాణలో తన తండ్రి వైఎస్ ఆశయాలను సాధించేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలకు తల్లి విజయమ్మ మద్దతుగా నిలబడుతున్నారు. అలాగే బ్రదర్ అనిల్‌కుమార్ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు తమ పార్టీకి దూరమయ్యేలా మద్దతు కూడగడుతున్నారు. జగన్, షర్మిల మధ్య ఆస్తిపరంగా విభేదాలు వచ్చాయని, ఎన్నికల సమయంలో సీటు కేటాయింపు విషయం దగ్గర విభేదాలు వచ్చాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని షర్మిల అలకబూనారంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని ఇంతవరకు వీరిద్దరూ ఖండించలేదు. భవిష్యత్తులో మరి ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో వేచిచూడాల్సి ఉంది.!!












Click it and Unblock the Notifications