AP Volunteers: వాలంటీర్లకు జగన్ మరో గుడ్ న్యూస్- ఇక ఏకంగా డబుల్ ..!
ఏపీలో వాలంటీర్లకు ప్రభుత్వం ఎన్నికల వేళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలను లబ్దిదారుల ఇంటి వద్దకు చేరుస్తూ కీలకంగా మారిపోయిన వాలంటీర్లు గౌరవ వేతనాలతోనే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి వివిధ రూపాల్లో లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదీ త్వరలోనే అమల్లోకి రాబోతోంది. దీంతో వారికి చేకూరే లబ్ది రెట్టింపు కాబోతోంది.

ఏపీలో ఏడాది పొడవునా లబ్దిదారులకు సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకెళ్లి అందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఉగాది సమయంలో ప్రత్యేక నగదు పురస్కారాలు అందిస్తున్నారు. సాధారణంగా 5 వేల రూపాయల గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ ఈ సేవలు చేస్తున్న వీరికి ప్రోత్సాహక అవార్డుల రూపంలో కొంత మొత్తాన్ని అందిస్తున్నారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరుతో మూడు కేటగిరీల్లో ఇస్తున్న ఈ అవార్డులకు అందించే మొత్తాన్ని రెట్టింపు చేయబోతోంది.
ప్రస్తుతం సేవా వజ్ర అవార్డు కింద వాలంటీర్లకు రూ.30 వేలు అందిస్తుండగా.. దాన్ని రూ.60వేలకు పెంచబోతున్నారు. అలాగే సేవా రత్న కింద రూ.20 వేలు అందిస్తుండగా.. దాన్ని ఇప్పుడు రూ.40 వేలకు పెంచనున్నారు. అలాగే సేవా మిత్ర కింద ఇస్తున్న రూ.10 వేల మొత్తాన్ని రూ.20 వేలకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. వాలంటీర్ల అవార్డుల మొత్తాలు రెట్టింపు కానున్న నేపథ్యంలో వీటికి అవసరమైన బడ్జెట్ ను కూడా రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచనున్నారు.
రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో ఐదుగురి చొప్పున 875 మందికి ఏటా సేవా వజ్ర అవార్డులు ఇస్తున్నారు. అలాగే ప్రతీ మండలం, మునిసిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున, నగర పాలక సంస్ధ నుంచి 10 మంది చొప్పున 4220 మందికి సేవారత్న అవార్డు, మిగిలిన వారికి సేవా మిత్ర అవార్డులు అందిస్తున్నారు. ఎన్నికల వేళ వీరికి ఇచ్చే అవార్డుల మొత్తాన్ని రెట్టింపు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications