టీడీపీ కంచుకోటల్లో జగన్ కీలక నిర్ణయం - కొత్త ఇంఛార్జ్ లు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం నేటి నుంచి కొత్త మలుపు తీసుకుంటోంది. జగన్, చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక, ప్రచారం..ఎన్నికల మేనిఫెస్టో పైనే అధినేతలు ఫోకస్ చేసారు. ఇదే సమయంలో గుంటూరు కంచుకోటలుగా భావిస్తున్న నియోజకవర్గాల్లో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ కొత్త ఇంఛార్జ్ లను నియమించారు.
కీలక నియామకాలు
ఈ ఎన్నికల్లో జగన్ - చంద్రబాబు ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా టీడీపీ బలంగా ఉన్నట్లు భావిస్తున్న నియోజకవర్గాల పైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అదనంగా పార్టీ నుంచి ముఖ్య నేతలను మొహరిస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యులను ఎన్నికల ఇంఛార్జ్ గా నియమిస్తూ జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గతంలో ఎన్నికల్లో పోటీ, పని చేసిన అనుభవం సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు.

హోరా హోరీ పోరు
టీడీపీ నేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి ఇంఛార్జ్ బాధ్యతలను ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఇప్పటికే అక్కడ మురుగుడు లావణ్యతో కలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ లోకేష్ ఈ సారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో తొలి నుంచి అడుగులు వేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరితో పాటుగా టీడీపీ బలంగా కనిపిస్తున్న వేమూరు నియోజకవర్గ బాధ్యతలను కేటాయించారు. అదే విధంగా, మర్రి రాజశేఖర్ కు తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. తాడికొండ, ప్రత్తిపాడు నియోకవర్గాల్లో సామాజిక సమీకరణాలు..ఓట్ బ్యాంక్ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. రేపల్లో నియోజకవర్గం కోసం వైసీపీ ఎన్నికల పరిశీలకుడిగా గాదె మధుసూధన రెడ్డిని నియమించారు.
అక్కడే ఫోకస్
ఇక, వైసీపీ- టీడీపీ ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా పోటీ పడుతున్న సత్తెనపల్లి, చిలకలూరిపేట, పర్చూరు, సంతనూతలపాడు, వేమూరు నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జ్ గా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి జగన్ బాధ్యతలు కేటాయించారు. మోదుగుల గతంలో నర్సారావుపేట నుంచి టీడీపీ ఎంపీగా వ్యవహరించారు. దీంతో, స్థానిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. తాజాగా జరిగిన నియామకాల మేరకు ఈ నేతలు నియోజకవర్గాల్లోనే మకాం వేయాలని పార్టీ అధినేత ఆదేశించారు. ప్రచారంతో పాటుగా ఎన్నికల సమన్వయం, కావాల్సిన సహకారం అందించాలని స్పష్టం చేసారు. దీంతో, కీలక నియోజకవర్గాల్లో పోరు మరింత ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications