పార్టీకి సీనియర్ల షాక్, జగన్ అలర్ట్ - తాజా నిర్ణయం..!!
వైసీపీకి సీనియర్లు షాక్ ఇస్తున్నారు. ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. దీంతో..పార్టీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. అటు కూటమి ప్రభుత్వం నుంచి రాజకీయంగా వస్తున్న ఆరోపణల పైనా చర్చలు చేస్తున్నారు. పార్టీ నేతలకు కీలక సూచనలు చేసారు.
వరుస రాజీనామాలు
వైసీపీని ముఖ్య నేతలు వీడటంతో పార్టీలో అనిశ్చితి కొనసాగుతోంది. జగన్ కు సన్నిహిత నేతలుగా పేరున్న వారు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. లిస్టులో మరి కొంత మంది ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీంతో, జగన్ పార్టీ ముఖ్యులతో సమావేశాలు నిర్వహించారు. అటు పార్టీని తిరిగి యాక్టివ్ చేసే క్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులను నియమించారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలకు కొత్త అధ్యక్షులను జగన్ ఖరారు చేసారు. బాలినేని పార్టీ వీడటంతో ఈ రోజు ప్రకాశం జిల్లా నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లిని ఖరారు చేసే అవకాశం ఉంది.

కొత్త అధ్యక్షులు
ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో సమావేశం తరువాత శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్ పేరు ఖరారు చేసారు. విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు పేరును జగన్ ఖరారు చేసారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు, టీటీడీ మాజీ ఛైర్మన్ జగన్ తో సమావేశమయ్యారు.
తిరుమల నెయ్యి వివాదం
తిరుమల లడ్డూ ప్రసాదం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన చర్చించారు. నాలుగేళ్లు టీటీడీ చైర్మన్‌గా ఉన్న తాను, భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చానని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వెంకటేశ్వర స్వామిపై అత్యంత నమ్మకం ఉన్న హిందువుగా.. తన హయాంలో టీటీడీలో ఎలాంటి అపచారాలు, అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదని, ఆ స్వామి వారి పాదాల చెంత కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ ఒక లాబ్ రిపోర్టు ఆధారంగా నెయ్యిలో అపవిత్రమైనవి గుర్తించినట్లుగా ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications