కోర్టుకు జగన్: వచ్చే నెల 12కు విచారణ వాయిదా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలున్నందున కోర్టుకు రాలేకపోతున్నామని మాజీ మంత్రులు, శాసనసభ్యులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డి, మంత్రి జె. గీతారెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అభ్యర్థన మేరకు సిబిఐ కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.
పది అభియోగ పత్రాలపై విచారణ జరుపుతున్న సిబిఐ కోర్టు ముందు జగన్‌తో పాటు విజయసాయి రెడ్డి, బిసిసిఐకి చెందిన శ్రీనివాసన్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు శుక్రవారం హాజరయ్యారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో దాదాపుగా అందరికీ బెయిల్ మంజూరైంది. వారంతా జైలు నుంచి విడుదలై బయటే ఉన్నారు. ఈ స్థితిలో కోర్టు విచారణకు వారంతా హాజరు కావాల్సి ఉంటుంది. శానససభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చకు వచ్చే అవకాశాలున్నాయని భావించారు. కానీ గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది.
కేసులో నిందితులుగా తమ పేర్లను చేర్చడంతో మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. భారీ పరిశ్రమల మంత్రి జె. గీతా రెడ్డి మాత్రం మంత్రిగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications