మేకప్ వేసుకుని షూటింగ్‌కు వెళ్లి చనిపోతే రూ.10 లక్షలు, ఇప్పుడేమో..: బాబుపై జగన్
రాజమండ్రి: మేకప్ చేసుకుని షూటింగ్ కోసం వెళ్లి మనుషులు చనిపోతే రూ. 10 లక్షల రూపాయలేసి నష్టపరిహారం ఇస్తావు, కూలీల కుటుంబంలో సంపాదించి పెట్టే కుటుంబ పెద్ద చనిపోతే వాళ్లకు తక్కువ పరిహారం ఎందుకు ఇస్తావని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలను ఆయన సోమవారం పరార్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
గండేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షలేసి నష్టపరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు రెండు లక్షల వంతున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం జరగడంలో ఎపి జెన్కో, జెన్కో కాంట్రాక్టర్లది కూడా తప్పు ఉందని, జెన్కోపై కోర్టులో కేసు వేసి పరిహారం లాగుతామని ఆయన చెప్పారు.
పనులు చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు కూలీలు ఎపి జెన్‌కో పవర్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ సరఫరా చేసే వాహనంలో వచ్చారని, ఫ్లై యాష్ వేడిగా ఉంటుందని జెన్కో అధికారులకు తెలుసుని, కాంట్రాక్టర్లకు కూడా తెలుసుని, అందులో మనుషులను ఎక్కించుకోవడం తప్పు అని ఆయన అన్నారు. మీకు పబ్లిసిటీ వస్తుందంటే పరిహారం ఐదు లక్షల రూపాయలు ఇస్తారు గానీ ఇలా చనిపోయినవారికి ఇవ్వరని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

ఓ శాసనసభ్యుడు, మంత్రి వచ్చినా మృతుల కుటుంబ సభ్యులను కలుసుకోలేదని ఆయన విమర్శించారు. ై ప్రమాదం జరగడంలో ప్రభుత్వం తప్పు కూడా ఉందని ఆయన అన్నారు. రెండు లక్షల రూపాయల నష్టపరిహారంతో ఎలా బతుకుతారని ఆయన అడిగారు. తాను వస్తున్నట్లు తెలిసి ఒక్కో వ్యానులో మూడు మృతదేహాలను పెట్టి నెట్టేశారని, తాను వస్తున్నానంటే ఎందుకంత భయమని ఆయన అన్నారు.
పిల్లలు ఇక్కడే ఉండగా వాళ్లకు ఇవ్వకుండా ఎందుకు పంపించి వేశారని అడిగారు. చంద్రబాబు చేస్తున్న పనుల్లో ఇంతకన్నా దుర్మార్గం ఏదీ ఉండదని ఆయన అన్నారు ఈ ప్రభుత్వంలో ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ గోల్‌మాలేనని, అన్నింటిలో చంద్రబాబుకు లంచాలేనని ఆయన అన్నారు.
ఈ ప్రభుత్వంలో ఉన్నంత అవినీతి మరే ప్రభుత్వంలోనూ లేదని ఆయన దుయ్యబట్టారు. చివరకు ఎపి జెన్కో సరఫరా చేసే బొగ్గులో కూడా అవినీతేనని ఆయన అన్నారు. మద్యం ఆదాయం పెంచుకోవడానికి కొంత మందికే, తనకు లంచాలు ఇచ్చినవాళ్లకే అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. లంచాలిస్తూ ఆడియో, వీడియో టేపులతో పట్టుబడితే ఆ కేసు నుంచి బయటపడడానికి ప్రత్యేక హోదాను సైతం ఫణంగా పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications