బాబు, లోకేష్ లంచాలు తీసుకుంటున్నారు: 'హోదా'పై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
శ్రీకాకుళం: ఏపీలో తీసుకున్న లంచాలతో తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టిడిపి ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిపోయాడని వైసిపి అధ్యక్షులు జగన్ అన్నారు. అందుకే ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని నిలదీయడం లేదన్నారు. శ్రీకాకుళంలో ప్రత్యేక హోదా కోసం యువభేరీ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.
ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వకుంటే రూ.2వేలు ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పారన్నారు. బాబు అధికారంలోకి వచ్చినా హామీలు నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. విద్యార్థులను ప్రజలను మోసం చేస్తే వారి ఉసురు చంద్రబాబుకు తగులుతుందన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. అంగన్వాడీలను నిర్దాక్షిణ్యంగా కొట్టించాడని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు భయంతో బతుకుతున్నారని, రైతులు, మహిళలు రుణాల మాఫీ కోసం నిరీక్షిస్తున్నారని, ఉద్యోగాలు పోయాయని ఎద్దేవా చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన బాబు చేయలేదన్నారు.

చంద్రబాబు ప్రతి మాట నీటి మీద అక్షరాలుగా మిగిలిపోయిందన్నారు. 22 నెలల కాలంలో చంద్రబాబు ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. చంద్రబాబు కనీసం తన హామీలు నెరవేర్చలేదని, కనీసం కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ కోసమైనా ఒత్తిడి తేవడం లేదన్నారు.
ప్రత్యేక హోదా వల్ల ఏపీకి లాభం ఉంటుందని చెప్పారు. నిధుల పరంగా, పారిశ్రామికపరంగా ప్రత్యేక హోదాతో ఏపీకి లాభం ఉంటుందన్నారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందన్నారు. ఆ రాష్ట్రాలు లాభపడుతున్నాయన్నారు. హోదా ఉంటే పక్క రాష్ట్రాలని వాళ్లు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారన్నారు.
చంద్రబాబు ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నారన్నారు. చంద్రబాబు ముఖం చూసో, జగన్ ముఖం చూసో పారిశ్రామికవేత్తలు రారని, ప్రత్యేక హోదా ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు వస్తారని చెప్పారు. కేంద్రం నుంచి ఇప్పుడు 30 శాతం నిధులు గ్రాంటుగా వస్తున్నాయని, హోదా వస్తే 90 శాతం గ్రాంటుగా వస్తాయన్నారు.
అందరు కలిసి రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడిగితే మన చెవుల్లో పూవులు పెడుతున్నారని ఆరోపించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీకి గతి లేకుంటే ఎలా అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నారు.
రాజకీయ నాయకులంటే చిన్న పిల్లాడి నుంచి ఎవరూ నమ్మలేని పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబు, ప్రధాని మోడీ లాంటి వారేనని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి నిలదీస్తే రకరకాల అబద్దాలు వారు చెబుతున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తే తన వల్లే వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకునే వారన్నారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా తేలేకపోతున్నారు కాబట్టి.. అది అవసరం లేదని చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాను ఉద్దేశించి.. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు.
ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్‌కు, బీహార్ ఎన్నికల సమయంలో వెళ్లి లక్షల కోట్లు ప్రకటించారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తాము కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రధాని మోడీకి ఎందుకు అల్టిమేటం ఇవ్వరని చంద్రబాబును ప్రశ్నించారు.
రాష్ట్రంలో బాగా అవినీతి ఉందన్నారు. విశాఖ నుంచి వెళ్లే ఇసుకలో అవినీతి జరుగుతోందన్నారు. మంత్రులు, బలమైన ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాను నడుపుతున్నారన్నారు. ఈ మాఫియాలో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్‌కు కొంత పోతుందన్నారు.
మద్యం మాఫియా కూడా ఉందన్నారు. గ్రామ గ్రామంలోను కల్తీ మద్యం ఉందన్నారు. బొగ్గు నుంచి ఇసుక దాకా, ఇసుక నుంచి మద్యం దాకా, మద్యం నుంచి కాంట్రాక్టర్ల దాకా కుంభకోణాలే అన్నారు. ధరలు పెంచి మరీ స్కాంలు చేస్తున్నారన్నారు. ప్రతి అంశంలో కుంభకోణాలన్నారు.
లంచం తీసుకున్న డబ్బుతో, ఈ నల్లధనంతో చంద్రబాబు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో టిడిపి ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని గత ఏడాది ప్రయత్నాలు చేశారన్నారు. తెరాసకు చెందిన 8 మంది ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాలని చూసి దొరికిపోయారన్నారు. ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు దొరికిపోయారన్నారు.
ఆ కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఆగచాట్లు పడుతున్నారన్నారు. అందుకే ప్రత్యేక హోదా పైన కేంద్రానికి అల్టిమేటం జారీ చేయడం లేదన్నారు. అల్టిమేటం జారీ చేసే దమ్ముధైర్యం లేక చంద్రబాబు అయిదు కోట్ల ఏపీ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారన్నారు.
మీరు తీసుకునే లంచాల కోసం మా జీవితాలతో చెలగాటం అడవద్దని ప్రజలు చంద్రబాబును నిలదీయాలన్నారు. ప్రత్యేక హోదా నా ఒక్కడి వల్ల సాధ్యం కాదని, జగన్‌కు అందరి అండ కావాలన్నారు. ప్రత్యేక హోదా గురించి అందరూ పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. చంద్రబాబు హోదా పైన అబద్దాలు చెబుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications