రిజైన్‌పై జగన్ పిటిషన్: అనుమతిస్తే ముంపు ప్రాంతాల్లో
హైదరాబాద్/ న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాను లోకసభ స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కోర్టుకెక్కారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన గురువారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆయనతో పాటు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి కూడా ఢిల్లీ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కాంగ్రెసు తరఫున లోకసభకు ఎన్నికైన ఎస్పీవై రెడ్డి ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

కాగా, కోర్టు అనుమతిస్తే ఈ నెల 27, 28 తేదీల్లో వైయస్ జగన్ వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ గురువారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విషయం చెప్పారు. వరద బాధితులను జగన్ పరామర్శిస్తారని ఆయన చెప్పారు.
జగన్‌కు కోర్టు అనుమతి రాకపోతే పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన హైదరాబాదులో సమైక్య శంఖారావం సభ జరుగుతుందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు వైయస్ జగన్ కేసులో నిందితుడు, ఆడిటర్ విజయసాయి రెడ్డికి అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతి మేరకు ఆయన వచ్చే ఏడాది మే 31వ తేదీ వరకు ఢిల్లీ వెళ్లి రావడానికి అవకాశం ఉంటుంది. విజయసాయి రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications