సాయిరెడ్డి, బాబాయ్ మధ్య జగన్ రాజీ ఫార్ములా - ఇద్దరికీ కొత్త బాధ్యతలు..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా కొత్తగా పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించారు. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ పరంగా జగన్ వరస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సుబ్బారెడ్డిని తప్పించారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిన సాయిరెడ్డికి తిరిగి జగన్ విశాఖ బాధ్యతలను కేటాయించారు. అదే విధంగా సీనియర్లకు కీలక జిల్లాలను అప్పగించారు.
విశాఖకు సాయిరెడ్డి
ఎన్నికల్లో పరాజయం తరువాత మాజీ సీఎం జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్పు చేసారు. తాజాగా పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లను ఖరారు చేసారు. ఇప్పటి వరకు గోదావరి జిల్లాలకు ఇంఛార్జ్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి తాజాగా కూటమి బలంగా ఉన్న గుంటూరు, ప్రకాశం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు కేటాయించారు. అదే విధంగా చిత్తూరు, నెల్లూరు రీజనల్ కో ఆర్డినేటర్ గా గతంలో రాయలసీమ బాధ్యతలు చూసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అప్పగించారు.

బొత్సాకు గోదావరి బాధ్యతలు
కృష్ణా జిల్లా పార్టీ రీజనల్ ఇంఛార్జ్ గా రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి కేటాయించారు. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల ఇంఛార్జ్ గా మాజీ మంత్రి..శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్సా సత్యనారాయణను నియమించారు. గతంలో ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా పని చేసిన రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డికి ఇప్పుడు తిరిగి విశాఖ బాధ్యతలను జగన్ కేటాయించారు. విశాఖ తో పాటుగా శ్రీకాకుళం ఇంఛార్జ్ గా సాయిరెడ్డి తిరిగి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు. అయితే, విజయనగరం బాధ్యతలను బొత్సానే పర్యవేక్షిస్తారు.
సీమకు సుబ్బారెడ్డి
అదే విధంగా..ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసిన వైవీ సుబ్బారెడ్డిని రాయలసీమ బాధ్యతలు చూడాలని జగన్ సూచించారు. వైవీ సుబ్బారెడ్డిని కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల ఇంఛార్జ్ గా నియమించారు. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాల్లో తాజా ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బ తింది. దీంతో.. తిరిగి ఇప్పుడు సుబ్బారెడ్డికి ఈ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా సుబ్బారెడ్డిని నియమించి.. సాయిరెడ్డిని ఇప్పటి వరకు రాజ్యసభ పార్టీ ఫ్లోర్ లీడర్ గా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తిరిగి విశాఖ బాధ్యతలు అప్పగించటం ద్వారా జగన్ కొత్త నిర్ణయాలు ఏ మేరకు పార్టీకి మేలు చేస్తాయనేది చూడాలి.












Click it and Unblock the Notifications