కుప్పంలో వ్యూహం మార్చిన వైఎస్ జగన్ ! మళ్లీ ఫామ్ 7 వాడక తప్పదా ?
ఏపీలో 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా తరచుగా చర్చలోకి వస్తున్న నియోజకవర్గం కుప్పం. విపక్ష నేత చంద్రబాబుకు వరుసగా ఏడుసార్లు విజయాలు కట్టబెట్టిన ఈ నియోజకవర్గంలో మరోసారి చంద్రబాబు గెలుస్తారా లేదా అన్న చర్చకు వైసీపీ తెరదీసింది. స్ధానిక ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాల నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ చర్చ ఆ తర్వాత వైసీపీ దూకుడు రాజకీయాలతో మరింత పెరిగింది. అయితే తాజాగా మళ్లీ కుప్పంపై చంద్రబాబు పట్టు నిరూపించుకున్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.

కుప్పంలో ఎత్తులు పైఎత్తులు
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆయన గెలుస్తారా లేదా అన్న చర్చ రెండేళ్ల క్రితం వైసీపీ వరుస విజయాల తర్వాత మొదలైంది. అధికార పార్టీగా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సత్తా చాటుకున్న వైసీపీ మరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఫీట్ రిపీట్ చేయగలుగుతుందా లేదా అన్న చర్చ కూడా దీంతోపాటే సమాంతరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కుప్పంలో పట్టు కాపాడుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, గెలిచి సత్తా చాటుకునేందుకు వైసీపీ అధినేత జగన్ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు.

తెరపైకి బోగస్ ఓట్ల వివాదం
ఇన్నాళ్లూ కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపుకు కారణాలు వెతుకుతున్న వైసీపీ చాలా విషయాల్ని తెలుసుకుంది. అయితే ఇందులో బోగస్ ఓట్ల వ్యవహారం మాత్రం లేదు. కానీ తాజాగా వైసీపీ స్ధానిక సమీక్ష నిర్వహించిన ఎంపీ మిథున్ రెడ్డి.. ఇక్కడ 30 వేలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని, వాటి సాయంతోనే చంద్రబాబు వరుసగా గెలుస్తున్నారని గుర్తించారు. దీంతో కుప్పంలో బోగస్ ఓట్ల వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ స్ధాయిలో బోగస్ ఓట్లు ఉంటే గతంలో కాంగ్రెస్, ఆ తర్వతా వైసీపీ ఏం చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ బోగస్ ఓట్లను తొలగించడం అంత సులువా అంటే కాదనే సమాధానమే వస్తోంది.

ఫామ్ 7 సాయంతో తొలగింపు ?
ఏదైనా నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నట్లయితే, అంటే సదరు ఓటరు నియోజకవర్గంలో లేడని, లేదా చనిపోయాడని, లేదా వేరే ప్రాంతంలో నివసిస్తున్నట్లు గుర్తిస్తే సదరు ఓటును తొలగించేందుకు ఫామ్ 7 ద్వారా ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఇదే అవకాశాన్ని వాడుకుని కుప్పంలో బోగస్ ఓట్ల తొలగింపుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కుప్పంలో సాధ్యమైనంత స్ధాయిలో బోగస్ ఓట్లు తొలగించగలిగితే చంద్రబాబును ఓడించవచ్చని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో కుప్పంలో ఈ ఓట్ల తొలగింపు ప్రయత్నాలు త్వరలో మొదలయ్యే అవకాశముంది.

2019లో వైసీపీని గెలిపించిన ఫామ్ 7 ?
గతంలో 2019 ఎన్నికల సమయంలో ఫామ్ 7 వివాదం ఏపీలో ప్రకంపనలు రేపింది. ఫామ్ 7 సాయంతో టీడీపీ తమ ఓట్లు తొలగిస్తోందని అప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది. సరిగ్గా అవే విమర్శల్ని టీడీపీ కూడా వైసీపీపై చేసింది. క్షేత్రస్ధాయిలో మాత్రం వైసీపీ నేతలు ఫామ్ 7పై పూర్తిగా దృష్టి పెట్టి టీడీపీ ఓటర్ల జాబితాలో చేర్పించిన బోగస్ ఓట్లను భారీ సంఖ్యలో తొలగించినట్లు తేలింది. దీంతో సహజంగానే ఆ మేరకు టీడీపీ నష్టపోయింది. అదే వ్యూహాన్ని ఈసారి కుప్పంలో ప్రయోగించడం ద్వారా బోగస్ ఓట్లకు చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎన్నికల సంఘం, అధికారులు ఎలా స్పందిస్తారన్న దానిపై ఈ వ్యూహం ఫలితం ఆధారపడి ఉంటుంది. కుదరకపోతే మాత్రం ఫామ్ 7 ప్రయోగం బెడిసి కొట్టే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications