బాబుపై రాష్ట్రపతికి ఫిర్యాదు: మాలాగే మీకు... ఢిల్లీ నేతలకు జగన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: తమ పార్టీ తరఫున గెలిచిన పలువురు నేతలు అధికార పార్టీలోకి వెళ్లి, మంత్రి పదవులు పొందారని, ఇప్పుడు ఈ పరిస్థితి తమకు వచ్చిందని, రేపు మీ పార్టీకి వస్తుందని వివిధ పార్టీల నాయకులను కలిసి హెచ్చరిస్తామని వైసిపి అధినేత జగన్ గురువారం అన్నారు.
చంద్రబాబు తన కేబినెట్లోకి వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు పదవులు ఇవ్వడంపై ఆగ్రహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతికి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రపతికి ఫిర్యాదు
ఫిరాయింపుల వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరించామన్నారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని తెలిపారు. చంద్రబాబు అనైతిక వివరాలను అందరి దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వేటు వేయకుండా, ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు. ఈ రాష్ట్రంలో జరిగిన వ్యవహారం రేపు మరో రాష్ట్రంలోను జరుగుతుందన్నారు.

ప్రజాస్వామ్యం ఖూనీ
అనర్హత పిటిషన్ పెండింగులో ఉండగానే కేబినెట్లోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను నివారించకుంటే ప్రజాస్వామ్యం ఖూని అవుతుందని జగన్ హెచ్చరించారు.
అన్ని పార్టీల నేతలను కలుస్తామని, ఇప్పుడు మాదాకా వచ్చింది, రేపు మీదాకా వస్తుందని అందరికీ చెబుతామని జగన్ అన్నారు. చంద్రబాబు అనైతిక వ్యవహారాలను అందరి దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.

ఓటుకు నోటులో ఇరుక్కొని..
ఓటుకు నోటు కేసులో అడడంగా దొరికిపోయిన చంద్రబాబు ఏపీలో ఫిరాయింపులకు తెరలేపారన్నారు. అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారన్నారు. బీజేపీని ప్రభావితం చేసే ప్రతి పార్టీ నేతను కూడా కలుస్తామని చెప్పారు.

వారిని కలుస్తాం
బీజేపీని ఎవరైతే ప్రభావితం చేయగలుగుతారో వారిని కలుస్తామన్నారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో జగన్, ఎంపీలు విజయ సాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోన రఘుపతి తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications