జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ - సేమ్ రిపీట్, అందుకే దాడి..!!
మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. తుఫాను వస్తుందని ముందచే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని..ఫలితంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. తన ఇంటికి రక్షించుకోవటం కోసం విజయవాడను ముంచారని ఆరోపించారు. చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారని..ఎవరి హయాంలో బోట్లుకు అనుమతి ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వానికి జగన్ హెచ్చరిక చేసారు.
జగన్ పరామర్శ
గుంటూరు జైలులో నందిగం సురేష్ ను జగన్ పరామర్శించారు. తుఫాను పైన హెచ్చరికలు ఉన్నా చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకోని కారణంగానే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందన్నారు. ఇన్ని లక్షల మంది ఇబ్బందులకు కారకులయ్యారని ఆరోపించారు. వరద నిర్వహణ పైన ఫోకస్ చేసి ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదన్నారు. వరదల్లో తన వైఫల్యం కప్పి పుచ్చుకోవటానికి నాలుగేళ్ల క్రితం టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసులో సంబంధం లేని మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేసార్నారు.

నాడు దూషించినందుకే
టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత పట్టాభి తనను అసభ్యంగా దూషించటంతో తనను అభిమానించే వారు ఆ పార్టీ కార్యాలయం పైకి వెళ్లారన్నారు. ఆ రకంగా తిడితే కడుపు మండదా అని ప్రశ్నించారు. అయినా, తాను వారి పైన 41ఏ నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశ పెట్టామని జగన్ గుర్తు చేసారు. ఆ కేసులో నందిగం సురేష్ కు అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు. రెడ్ బుక్ పెట్టుకోవటం ఘనకార్యం కాదన్నారు. ఇదే తరహా సంప్రదాయం కొనసాగితే ఇదే జైల్లో తరువాతి కాలంలో ఎవరు ఉంటారో గుర్తు పెట్టుకోవాలని జగన్ హెచ్చరించారు.
సునామీలా మారుతుంది
బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేసారని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన బోట్ల అంశంలో రాజకీయం చేస్తున్నారని..ఆ బోట్లు టీడీపీ నేతలకు చెందినవేనని జగన్ స్ఫష్టం చేసారు. వాస్తవాలు వక్రీకరించి..ఎవరూ వరదల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏ రకంగా వేధించినా తాము ప్రజల వైపే నిలబడతామని జగన్ తేల్చి చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. అక్రమ అరెస్టుల సంప్రదాయం కొనసాగితే సునామీగా మరి మీ పార్టీకే నష్టం చేస్తుందని జగన్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications