చంద్రబాబుకు తలబిరుసు, 7న గుంటూరులోనే జగన్ దీక్ష: బొత్స
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్షపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయమ మండిపడ్డారు. తలబిరుసుతనంతో, అహంభావంతో జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తమ పార్టీ అధ్యక్షుడు జగన్ వచ్చే నెల 7వ తేదీ గుంటూరులోనే దీక్ష చేస్తారని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాములు దీక్ష చేయడం వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆనాటి ప్రజల త్యాగాల వల్లనే మనం హాయిగా జీవిస్తున్నామని ఆయన చెప్పారు. చట్టబద్దంగా, ప్రజాస్వామిక పద్ధతిలో జగన్ చేయతలపెట్టిన దీక్షకు అనుమతి నిరాకరించడం సరైన చర్య కాదని ఆయన అన్నారు.
నిరవధిక నిరాహార దీక్ష చట్టవిరుద్ధమని పోలీసులు చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం గతంలో చంద్రబాబు దీక్ష చేశారని ఆయన అడిగారు. అహంభావంతో, ఆవేశంగా ఎదుటివారి మీద వ్యాఖ్యలు చేయడం సరి కాదని, శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాననే ధీమాతో వ్యవహరించినవారు గతంలో కాలగర్భంలో కలిసిపోయారని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రాష్టర్ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. తాము వ్యక్తిగత ప్రతిష్టకు వెళ్లదలుచుకోలేదని, రాష్ట్ర ప్రయోజానాల కోసమూ అభివృద్ధి కోసమూ ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తాము అడిగిన స్థలంలో జగన్ దీక్షకు అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు.
రాజధాని పేరు చెప్పి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు తన స్వప్రయోజనాల కోసం వెళ్తున్నారని ఆయన విమర్సించారు. రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎపి ప్రయోజానాలను సింగపూర్ ప్రభుత్వానికి చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని, దాన్ని అభివృద్ధి అని చెప్పడానికి సిగ్గు లేదా అని బొత్స అన్నారు. తమ ప్రజల కోసం, ప్రజల తరఫున తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications