రఘురామ పిటిషన్ కొట్టేయండి: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ కౌంటర్ దాఖలు
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేశారు జగన్. తాను బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రఘురామ పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. ఇది ఇలావుండగా, సీబీఐ కూడా కోర్టులో మెమో దాఖలు చేసింది. రఘురామ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. వాదనలు విన్న అనంతరం విచారణను జూన్ 14కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ సర్కారుపై విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం రఘురామపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పోలీసులు కొట్టారని, బెయిల్ ఇవ్వాలంటూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో రఘురామ చికిత్స పొందిన ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయిన తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆ తర్వాత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి పలువురు అధికారులపై ఫిర్యాదు చేశారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ మానవ హక్కుల సంఘానికి కూడా రఘురామ ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications