వైఎస్ జగన్ కు సర్కార్ షాక్- నోటీసులు- కారు సీజ్..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం ఇవాళ షాక్ ఇచ్చింది. తాజాగా నమోదైన ఓ కేసులో ఆయనకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయన వాడుతున్న కారును కూడా సీజ్ చేసింది. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. స్వయంగా తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లిన పోలీసులు.. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి జగన్ తరఫున నోటీసులు ఇచ్చారు. దీంతో జగన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
తాజాగా వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు వెళ్లారు. సత్తెనపల్లికి వెళ్తుండగా గుంటూరుకు సమీపంలో జగన్ కారు కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య చనిపోయాడు. ఆ విషయం తెలియని పోలీసులు జగన్ కాన్వాయ్ లో మరో కారు ఢీకొని చనిపోయాడని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత లభించిన వీడియోల ఆధారంగా సింగయ్య జగన్ కారు కింద పడి చనిపోయాడని గుర్తించారు. దీంతో కేసు ఎఫ్ఐఆర్ లో మార్పులు చేశారు.

సింగయ్య మృతి కేసులో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఏ1 గానూ, జగన్ ను ఏ2 గానూ చేర్చారు. ఇదే కారులో ప్రయాణించిన జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డిని ఏ3 గానూ, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీని ఏ4, ఏ5గానూ చేర్చారు. ఇప్పుడు ఈ కేసులో విచారణ కోసం జగన్ ను రావాలని కోరుతూ ఇవాళ తాడేపల్లిలోని జగన్ ఇల్లు కమ్ వైసీపీ కేంద్ర కార్యాలయంగా ఉన్న భవనానికి వెళ్లారు. అక్కడ పార్టీ కార్యాలయ ఇన్ ఛార్జ్ గా ఉన్న లేళ్ల అప్పిరెడ్డికి జగన్ తరఫున నోటీసులు ఇచ్చారు. అలాగే సింగయ్య మృతికి కారణమైన జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ ఫార్చ్యూనర్ కారు AP40DH2349 ను పోలీసులు సీజ్ చేశారు.













Click it and Unblock the Notifications