సీఎంగా ప్రమాణం చేశాక నా తొలి సంతకం ఆ ఫైల్ పైనే
YS Jagan Bus Yatra: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్తోంది. నేటికి ఈ బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది.
కడపలో యాత్రను ఆరంభించిన అనంతరం నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మీదుగా ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టారు వైఎస్ జగన్. ఇంకాస్సేపట్లో ఆయన పల్నాడు జిల్లాకు వెళ్లనున్నారు. వినుకొండ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు.

ఈ ఉదయం దర్శి నియోజకవర్గంలోని పొదిలి వెంకటాచలంపల్లిలో పింఛన్‌దారులతో ముఖాముఖిగా సమావేశం అయ్యారు వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా తమకు కలిగిన ప్రయోజనాలను వారంతా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పింఛన్ల పంపిణీని ప్రస్తావించారు. పింఛన్ కోసం అవ్వాతాతలు ఎన్నో అష్టకష్టాలు పడాల్సి వచ్చేదని గుర్తు చేశారు. అప్పట్లో వారంతా పింఛన్ తీసుకోవడానికి ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు వరకు కూడా 1,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేవారని, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచామని అన్నారు. అప్పట్లో చంద్రబాబు 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే- తాము వచ్చిన తరువాత ఈ అయిదు సంవత్సరాల కాలంలో లబ్దిదారుల సంఖ్యను రెట్టింపు చేశామని అన్నారు.

ఇప్పుడు 66 లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్ ఇస్తున్నామని జగన్ వివరించారు. దేశంలో ఎక్కడ కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే వ్యవస్థ లేదని, తాము దీన్ని అమలు చేశామని చెప్పారు. పెన్షన్లు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా లబ్దిదారుల ఇళ్లకు తెచ్చి ఇచ్చామని అన్నారు.
కులం, మతం, ప్రాంతం అనే కాకుండా పార్టీలు కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చేది తామేనని జగన్ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించే ప్రతిపాదనలపైనే తొలి సంతకం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications