రెడ్ బుక్ కు పోటీగా కొత్త బుక్ మొదలు పెట్టామన్న వైఎస్ జగన్!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా సంచలన ప్రకటన చేశారు. టిడిపి రెడ్ బుక్ స్థానంలో తాము గుడ్ బుక్ రాస్తున్నామని వైయస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెర తీసిందని పేర్కొన్న జగన్ తాము దానికి బదులు మంచిని ఉద్దేశించి గుడ్ బుక్ రాస్తామని వెల్లడించారు .పార్టీ కోసం కష్టపడే వారి వివరాలన్నింటినీ ఆ బుక్ లో రాస్తున్నామన్నారు.
తాము చేసిన మంచి బ్రతికే ఉందన్న జగన్
వారికి తప్పకుండా భవిష్యత్తులో మంచి అవకాశాలు, ప్రమోషన్లు కల్పిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో మంగళగిరి నియోజకవర్గం నేతలు కార్యకర్తలతో సమావేశమైన వైస్ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేశామని, తాము చేసిన మంచి ప్రతి ఇంట్లో బ్రతికే ఉందన్నారు. వైసిపి పాలనలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చామన్నారు.

అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం
అంతేకాదు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నామని కోవిడ్ మహమ్మారి లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని గుర్తు చేశారు .తమ పాలన సమయంలో వచ్చిన సంక్షోభాల కారణంగా ఖర్చులు పెరిగి, ఆదాయాలు దారుణంగా తగ్గాయని అయినా పథకాల అమలుకు ఎలాంటి సాకు చూపలేదని జగన్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు.
నాలుగు నెలల కాలంలోనే మొత్తం యూటర్న్ పాలన
ప్రస్తుత ప్రభుత్వం తిరోగమన ప్రభుత్వమని అన్ని విధాలుగా వైఫల్యం చెందిన ప్రభుత్వమని జగన్ విమర్శించారు. ప్రతి అడుగులోనూ అంతులేని వివక్ష ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కనిపిస్తుంది అన్నారు. కేవలం నాలుగు నెలల కాలంలోనే మొత్తం యూటర్న్ పాలన కొనసాగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు దారుణంగా పతనమవుతున్నాయని వైయస్ జగన్ విమర్శించారు.
తనకన్నా తీవ్రంగా ఎవరిని వేధించి ఉండరు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేధింపులు సహజమని పేర్కొన్న జగన్ తనకన్నా తీవ్రంగా ఎవరిని వేధించి ఉండరని గుర్తు చేశారు. అయినా తాను ఏనాడు అధైర్య పడలేదని, ధైర్యంగానే ముందుకు సాగానని కార్యకర్తలకు చెప్పిన జగన్ వారిలో ఆత్మస్థైర్యాన్నింపడానికి ప్రయత్నించారు. ప్రస్తుత కూటమి పాలనలో దారుణ పరిస్థితులు ఉన్నాయని మంగళగిరి నియోజకవర్గంలో మితిమీరిన అరాచకాలు కొనసాగుతున్నాయని జగన్ ఆరోపించారు. వైసిపి కార్యకర్తలు ఎవరి అరాచకాలకు భయపడాల్సిన పని లేదన్నారు.
చంద్రబాబు మోసాలు, అబద్దాలు
పార్టీ ఎప్పుడూ వారికి తోడుగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మితిమీరిన అధికార దుర్వినియోగం కొనసాగుతుందని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పినవన్నీ మోసాలని, అబద్దాలని పేర్కొన్న జగన్ ప్రజల కోపం నుంచి పుట్టే ఓటు భవిష్యత్తులో చంద్రబాబుకి సింగిల్ డిజిట్ కూడా రాకుండా చేస్తుందని అభిప్రాయపడ్డారు.
కష్టాల నుండే నాయకులు పుడతారు
ఇక ఇదే సమయంలో గ్రామస్థాయి నుంచి బూత్ కమిటీలు ఏర్పాటు జరగాలని క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వైసిపి కార్యకర్తలను , అభిమానులను ఏకం చేసి వారందరి ద్వారా పార్టీ బలమైన నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. కష్టాలనుంచే నాయకులు పుడతారని కేసులు పెట్టి జైలుకు పంపించినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే కష్టాలు ఎక్కువ కాలం ఉండవని వైయస్ జగన్ కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపారు.












Click it and Unblock the Notifications